రూ. 150 కోట్లు కూడా ఖర్చుచేయలేని అసమర్థులా?
Published on: Tue Apr 3, 2012 10:00AM
కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి రూ. 150 కోట్లు ప్రత్యేక నిధులను విడుదల చేసినప్పటికీ వాటిని ఖర్చు చేయలేని నిస్సహాయతలో రాష్ట్రప్రభుత్వ అధికారులు ఉన్నారు. వామపక్ష తీవ్రవాద మావోయిస్టుల ప్రభావానికి గురైన జిల్లాలకు ఒక్కోదానికి రూ. 30 కోట్లు చొప్పున కేంద్రం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. దీనిలో భాగంగా మనరాష్ట్రంలోని అయిదు జిల్లాలకు రూ. 150 కోట్ల మేరకు గత ఏడాది నిధులు మంజూరయ్యాయి. వాటిని ఈ ఏడాది మార్చి 31 లోగా ఖర్చుచేయాల్సి ఉంటుంది. మార్చి 31 తరువాత మరో రూ. 150 కోట్లు ఈ అయిదు జిల్లాలకు మంజూరవుతాయి.
కానీ ఇప్పటికే మంజూరు చేసిన నిధులను విజయనగరం, శ్రీకాకుళం, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల అధికారులు ఖర్చు చేయలేకపోయారు. ఈ రూ. 150 కోట్లలో సగం మొత్తం గిరిజన సంక్షేమశాఖకు, మిగిలిన రూ. 150 కోట్లు పంచాయితీ రాజ్, ఆర్ డబ్యూ ఎస్ శాఖలకు కేటాయించారు. నిజానికి ఈ మొత్తాన్ని ఇప్పటికే ఖర్చుచేసి ఉంటే గిరిజనులకు కొంత మేలు జరిగి ఉండేది. ఆ ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాల భవనాలు, కల్వర్టులు అభివృద్ధి చెంది ఉండేవి, కానీ అధికారుల అసమర్థత కారణంగా ఈ నిధుల్లో కనీసం 10 శతం కూడా ఖర్చుకాలేదు. ఒకవైపు నిధులు లేక అనేక ప్రాజెక్టులు నత్తనడకన సాగుతుంటే మరోవైపు మన అధికారుల అసమర్థత కారణంగా మంజూరైన నిధులు నిరుపయోగంగా పడి ఉంటున్నాయి.


