TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేంద్ర సాయం ఏదీ ఎక్కడ?

Published on: Tue Oct 1, 2024 10:20AM

మాటలు కోటలు దాటుతాయి.. అడుగు మాత్రం గడప దాటదు అన్నట్లుగా ఉంది కేంద్రం తీరు. కనీవినీ ఎరుగని వర్షాలు, వరదలతో అతలాకుతలమైపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పిన కేంద్రం ఆ విషయంలో ఇప్పటి వరకూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.  బుడమేరు, కృష్ణా నది వరదలలో రాష్ట్రంలో అపార నష్టం సంభవించిన సంగతి విదితమే.

ముఖ్యంగా విజయవాడ నగరం బుడమేరు వరదతో చిగురుటాకులా వణికి పోయింది. లక్షల మంది రోజుల తరబడి వరద నీటిలో అష్టకష్టాలూ పడ్డారు. ఆస్తుల నష్టపోయారు. అయితే కేంద్రం మాత్రం ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటి వరకూ జాతీయ విపత్తు నిధి నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించిన వరద  నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించడం కూడా జరిగింది.  ఆసందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ బెజవాడ వరద విపత్తుని మాటలకందని విషాదంగా అభివర్ణించారు. అయితే పర్యటన ముగించుకుని హస్తిన వెళ్లిన తరువాత ఆయన మౌనముద్ర వహించారు. 

సెప్టెంబర్ 1,2 తేదీలలో విజయవాడ భారీ వర్షాలు, వరదల కారణంగా భారీగా నష్టపోయింది.  రాష్ట్ర ప్రభుత్వం వరదల కారణంగా  రూ. 7600 కోట్ల నష్టం జరిగిందని కేంద్రానికి నివేదిక పంపింది. ఈ వరదలలో 74 మంది మరణించారు. 2.82 లక్షల కుటుంబాలు వరద ప్రభావానికి గురయ్యారు.  7 లక్షల మంది పునరావాస కేంద్రాలలో తలదాచుకున్నారు. 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వేలాది కిలోమీటర్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి. విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం. అనేక పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ళు చనిపోయాయి. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర అధికారులు వరద తీవ్రతను, నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇవన్నీ జరిగి నెల రోజులు అయినా ఇప్పటి వరకూ కేంద్రం నుంచి ఒక్క పైసా సహాయం కూడా అందలేదు. ఇదే విషయాన్ని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి ప్రస్తావించారు. వెంటనే రాష్ట్రానికి  7600 కోట్ల రూపాయలు వరద సాయం అందించాలని డిమాండ్ చేశారు.