TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేంద్రం సీరియస్

Published on: Thu Nov 10, 2022 10:10AM

తెలంగాణ సర్కర్ పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేంద్రం సీరియస్ గా ఉందని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై రహస్య విచారణ జరుపుతోందని రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గవర్నర్ తమిళిసై స్వయంగా తన ఫోన్ ట్యాప్ అయ్యిందన్న అనుమానాలున్నాయని మీడియా సమావేశంలో ఆరోపించిన తరువాత ఇదే అనుమానాలు పలువురు రాజకీయ నేతల నుంచి కూడా వ్యక్తమయ్యాయి.

రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చాలా కాలం నుంచీ ఉన్నాయి. వోటుకు నోటు కేసు వ్యవహారంలో అప్పట్లో చంద్రబాబు ఫోన్ కూడా ట్యాప్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతే కాకుండా ఐటీ, ఈడీ దాడుల వ్యవహారాలన్నీ ముందుగానే సర్కార్ కు తెలుస్తున్నాయన్న అనుమానాలకు కూడా ఉన్నాయి. దీని వెనుక కూడా ఫోన్ ట్యాపింగ్ ఉందని అంటున్నారు. అలాగే వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో మోడీ ప్రకటన కంటే కేసీఆర్ తమ డిమాండ్ మేరకు కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేయనున్నదని ప్రకటించడాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు.

అలాగే గవర్నర్ తమిళిసై ఫోన్ కు వచ్చిన మెసేజ్ టీఆర్ఎస్ నాయకులకు ముందే ఎలా తెలిసిందని గవర్నర్ ప్రశ్నిస్తున్నారు. రాజ్ భవన్ ను ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో ఇరికించేందుకు తుషార్ పేరును తెరమీదకు తీసుకువచ్చారని అంటున్నారు. తెరాస హయాంలో తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థుల పోన్ ట్యాపింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉండగా...  ఇప్పుడు తాజాగా తమిళిసై కూడా అవే అనుమానాలు వ్యక్తం చేయడంతో కేంద్రం సీరియస్ గా రియాక్ట్ అయ్యిందనీ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రహస్య విచారణకు ఆదేశించిందనీ రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఒక్క గవర్నర్ అనే కాకుండా రాష్ట్రంలోని తెరాసయేతర పక్షాలన్నీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.