రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకుంటం.. కేసీఆర్ పై కేంద్రమంత్రి ఆగ్రహం
Published on: Tue Dec 21, 2021 1:53PM
వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రం, తెలంగాణ రాష్ట్రం మధ్య వివాదం ముదురుతోంది. కేంద్రంతో తాడో పేడో తేల్చుుకుంటామంటూ ఢిల్లీకి వెళ్లి కూర్చుంది తెలంగాణ మంత్రుల బృందం. సోమవారం టీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా చావు డప్పు పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. కేసీఆర్ తీరుపై రాష్ట్ర బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. తాజాగా కేసీఆర్ ఆరోపణలు, తెలంగాణ సర్కార్ తీరుపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కౌంటరిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులను అయోమయానికి గురిచేస్తోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. గత రబీలో అదనంగా 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనేందుకు సీఎం కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని స్పష్టం చేశారు. ఉప్పుడు బియ్యాన్ని అదనంగా తీసుకునేందుకు కూడా కేంద్రం అంగీకరించిందని తెలిపారు. ఈ అవకాశాన్ని కేవలం తెలంగాణకు మాత్రమే ఇచ్చామన్నారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి తరలించలేదని కేంద్ర మంత్రి మండిపడ్డారు.
గత ఐదేళ్లలో ధాన్యం సేకరణ మూడు రెట్లు పెరిగిందన్నారు పియూష్ గోయెల్. ఇచ్చే ధరను కూడా 1.5 రెట్లు పెంచినట్లు చెప్పారు .సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. రా రైస్ ఎంత ఇచ్చినా కేంద్రం తీసుకుంటుందని గతంలోనే స్పష్టం చేశామన్నారు. రైతుల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృషి చేస్తున్నారన్నారు. కేంద్రంపై అసత్య ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని హితవు పలికారు. ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని పీయూష్ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


