TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమరావతికి అడ్డంకుల్లేవ్.. ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్డులకు కేంద్రం ఓకే

Published on: Sat Jul 6, 2024 10:07AM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఇక ఎలాంటి అడ్డంకులు, అవరోధాలు లేకుండా పరుగులు పెట్టనుంది. అమరావతి విషయంలో రాష్ట్ర వినతులన్నిటికీ కేంద్రం దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ముఖ్యంగా రాజధాని అమరావతికి మణిహారంలాంటి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డుకు కూడా కేంద్రం అంగీకారం తెలిపింది.  ఖర్చు ఎంతైనా  అమరావతి కోసం వ్యయం చేయడానికి కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విస్పష్ట హామీ ఇచ్చారు. హస్తిన పర్యటనలో భాగంగా గడ్కరీతో చంద్రబాబు భేటీ అయిన సంగతి తెలిసిందే.  

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 189 కిమీ పొడవైన ఓఆర్‌ఆర్‌ను  కేంద్రమే చేపట్టేందుకు అంగీకారం తులిపింది. పెరిగిన ట్రాఫిక్‌, నూతన వాహనాల తీరును దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక టెక్నాలజీతో ఔటర్‌ నిర్మాణం చేపడతామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ సీఎం చంద్రబాబుకు స్పష్టమైన హామీఇచ్చారు. ఖర్చు ఎంతైనా అమరావతికి అద్భుతమైన రహదారిని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఔటర్‌ నిర్మాణం కోసం ఇప్పటికే భూసేకరణ ప్లాన్‌ రెడీ అయ్యింది. రూ.18 వేల కోట్లతో ఈ రోడ్డు  నిర్మించాలని 2017-18లోనే ప్రతిపాదించగా కేంద్రం అప్పట్లోనే అంగీకరించింది. అయితే జగన్‌ వచ్చాక ఈ ప్రాజెక్టును మూలనపడేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో ఔటర్‌ మళ్లీ పట్టాలెక్కనుంది.  రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి ప్రాజెక్టులు, కొత్తగా చేపట్టాల్సిన రహదారులపై  చంద్రబాబు గడ్కరీకి ప్రతిపాదనలు సమర్పించారు.  అమరావతి ఔటర్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డుతోపాటు, విజయవాడలోని కీలక ప్రాంతాలను కలిసే తూర్పు బైపాస్‌ చేపట్టాలన్న చంద్రబాబు వినతికి సానుకూలంగా స్పందించిన గడ్కరీ ప్రజలకు, మౌలిక రంగం మరింత బలోపేతమయ్యేందుకు అవసరమైన సహకారమందిస్తామన్న విస్పష్ట హామీ ఇచ్చారు.   

రాష్ట్రంలో 7 వేల కిమీపైనే జాతీయ రహదారులున్నాయి. ప్రస్తుతం స్టేట్‌ హైవేలుగాఉన్న 3,200 కిమీ రోడ్లను కూడా జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని గడ్కరీకి చంద్రబాబు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇంకోవైపు జాతీయ, రాష్ట్ర రహ దారులను ఆధునిక టెక్నాలజీతో నిర్మిద్దామని గడ్కరీ ప్రతిపాదించారు. రోడ్లపై ఐదేళ్లకోసారి నిర్వహణ పేరిట కోట్లు ఖర్చుపెట్టడం, వర్షాలకు అవి దెబ్బతినడం జరుగుతోందని, ఇకపై సిమెంట్‌ (సీసీ) రోడ్లు నిర్మించే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో కూడా కొత్తగా చేపట్టే పెద్ద ప్రాజెక్టులు, జాతీయ రహదారులను అవసరాన్ని బట్టి సీసీ టెక్నాలజీతో నిర్మించేలా ప్రతిపాదనలు ఉండాలని ఆయన సూచించినట్లు తెలిసింది. ఆధునిక టెక్నాలజీతో రహదారుల నిర్మాణంపై టాటా కన్సల్టెన్సీతో అధ్యయనం చేయిస్తున్నట్లు ఆయన చంద్రబాబుకు తెలిపారు.