TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చెలామణిలో నకిలీ కరెన్సీ.. రూ.500 నోట్లతో జాగ్రత్త!

Published on: Tue Apr 22, 2025 6:28AM

500 రూపాయల నోట్లపై కేంద్ర హోంశాఖ సంచలన ప్రకటన చేసింది.   నకిలీ నోట్ల విషయంలో ఎన్ఐఏ, డీఆర్ఐ, సీబీఐ, సెబీ సహా అనేక శాఖలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. నకిలీ నోట్లకు ఒరిజినల్ నోట్లకు తేడా అస్సలు గుర్తించ లేకుండా ఉన్నాయనీ,  అప్రమత్తంగా ఉండానీ ఆదేశాలు జారీ చేసింది. చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ తో నకిలీ నోట్లు చెలామణి అయ్యే ప్రమాదం భారీగా ఉందని చెప్పింది. అలాగే ఇప్పటికే అలాంటి 500 నోట్లు సర్కులేషన్ లో ఉన్నాయని, అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ అలర్ట్ జారీ చేసింది. ఇక ఆర్బీఐ కూడా నకిలీ 500 రూపాయల నోట్ల విషయంలో ప్రజలను అప్రమత్తం చేసింది. 

నల్లధనాన్ని (బ్లాక్ మనీ) రూపుమాపడం, దొంగనోట్ల బెడద లేకుండా చేయడమే లక్ష్యమంటూ 2016 నవంబర్ లో ప్రధాని మోడీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. ఉరుములేని పిడుగులా మోడీ తీసుకున్న ఆ నిర్ణయం అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పట్లో మోడీ నిర్ణయంతో సంపన్నులు, పేదలు అన్న తేడా లేకుండా జనం నానా ఇబ్బందులూ పడ్డారు. గంటల తరబడి నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల ముందు క్యూలో నిలుచున్నారు. కొన్ని నెలల పాటు ప్రజలంతా నగదు చెలామణి విషయంలో అల్లాడిపోయారు. అయినా దొంగనోట్ల బెడద ఇక ఉండదన్న ఆశతో భరించారు.  అయితే మోడీ నాడు తీసుకున్న నిర్ణయం లక్ష్యాన్ని సాధించిందా? అంటే లేదని ఇప్పుడు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే చెబుతోంది. మార్కెట్ లో పెద్ద సంఖ్యలో దొంగనోట్లు చెలామణిలో ఉన్నాయనీ, అప్రమత్తంగా ఉండా లని ప్రజలను హెచ్చరిస్తోంది. ఆర్భాటంగా దేశ ప్రజలందరినీ నానా అగచాట్లకూ గురి చేస్తూ నాడు తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఎలాంటి సత్ఫలితాన్ని ఇవ్వలేదు సరికదా.. దొంగనోట్ల బెడద మరింత తీవ్రమైందని కేంద్రం స్వయంగా చెబుతోందిప్పుడు. 

నిజం ఆధునిక సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన నకిలీ 500 రూపాయల నోట్లు పెద్ద ఎత్తున చెలామణిలోకి వచ్చినట్లు కేంద్రమే స్వయంగా ప్రకటించింది.  ఇలా మార్కెట్లో చెలామణి అవుతున్న నకిలీ నోట్ల సంఖ్య ఎంతన్నది చెప్పడం కూడా కష్టమని పేర్కొంది. నకిలీ కరెన్సీ విషయంలో ప్రజలే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.   నకిలీ, ఒరిజినల్ నోట్లను గుర్తించడం కష్టంగా మారిందనీ పేర్కొంది. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ కూడా పేర్కొంది. అత్యంత నాణ్యతతో అచ్చుగుద్దినట్లు ఒరిజినల్ నోట్లను పోలి ఉండేలా నకిలీ నోట్లను రూపొందించిన నేర ముఠాలు వాటిని పెద్ద ఎత్తున మార్కెట్ లోకి తీసుకువచ్చారని, నకిలీ, ఒరిజినల్ మధ్య చిన్న అక్షరమే తేడా ఉందనీ పేర్కొంది. ఒరిజనల్ నోట్లపై రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెల్లింగ్ కరెక్టుకు RESERVE BANK OF INDIA అని ఉంటుందనీ, అయితే నకిలీ నోట్లపై ఆ స్పెల్లింగ్ RASERVE BANK OF INDIA అని ఉంటుందనీ వివరించింది. అత్యంత నిశితంగా పరిశీలిస్తే తప్ప మామూలుగా ఈ తేడాను కనిపెట్టడం కష్టమనీ పేర్కొంది.