TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మధ్య తరగతి నెత్తిన ‘గ్యాస్’ బండ

Published on: Fri Jun 3, 2022 7:34AM

ఒక్కటొక్కటిగా సబ్సిడీలు ఎత్తివేస్తూ కేంద్రం మధ్య తరగతి నడ్డి విరుస్తోంది. ప్రజా సంక్షేమం మాట గాలికి వదిలేసి మార్కెట్ మాయాజాలంలో జనాలు గిలగిలా కొట్టుకునేలా చేస్తోంది. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా, ధరల పెరుగుదల నియంత్రణ విషయాన్ని గాలికొదిలేసి.. కేంద్రం చోద్యం చూస్తోంది.

తాజాగా వంట గ్యాస్ పై సబ్సిడీని ఎత్తివేయడంతో మధ్య తరగతి నెత్తిన బండ పడింది. కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు ఇంత వరకూ గ్యాస్ సిలెండర్ పై ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేసింది. కేవలం ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలెండర్ కనెక్షన్ పొందిన వారికి మాత్రమే సబ్సిడీ వర్తిస్తుందంటూ ప్రకటించింది. ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన 9 కోట్ల మంది పేద మహిళలకు మాత్రమే సబ్సిడీ వర్తిస్తుంది.

కేంద్రం నిర్ణయంతో 21 కోట్ల మంది గ్యాస్ వినియోగదారులు సబ్సిడీకి ఇక అనర్హులు. వారంతా మార్కెట్ ధర చెల్లించి  గ్యాస్ సిలెండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్  పొందిన వినియోగదారులకు ఏడాదికి 12 సిలిండర్లపై, రూ.200 చొప్పున సబ్సిడీ అందుతుంది. ఈ సబ్సిడీ లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలో సబ్సిడీ సొమ్ము జమ అవుతుంది.

మిగతా వినియోగదారులు ఎప్పటికప్పుడు మార్కెట్ ధరకు అనుగుణంగా డబ్బులు చెల్లించి గ్యాస్ సిలెండర్ కొనుగోలు చేయాలి.   చమురుపై సబ్సిడీ ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం గతంలోనూ జరిగింది. 2010లో పెట్రోల్‌పై కేంద్రం సబ్సిడీని ఎత్తివేయగా, 2014లో డీజిల్‌పై సబ్సిడీని ఎత్తివేసింది. తాజాగా ఎల్పీజీ వంట గ్యాస్‌పై సబ్సిడీ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది మోదీ సర్కారు.