TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ సర్కార్ కు మరో షాక్.. గండం గట్టెక్కేదెలా.. 

Published on: Sun Jun 27, 2021 11:19AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలని ఇటీవల వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అన్ని రాష్ట్రాలకు భిన్నంగా పరీక్షల నిర్వహణపై పంతానికి పోయిన జగన్ సర్కార్... సుప్రీంకోర్టు అక్షింతలతో దిగొచ్చి పరీక్షలను రద్దు చేసింది. మాన్సాస్ ట్రస్ట్, సంగం డెయిరీ, విశాఖ భూముల అమ్మకం.. ఇలా అన్ని అంశాల్లోనూ ఏపీ సర్కార్ కు కోర్టుల్లో చుక్కెదురైంది. తాజాగా తెలుగు రాష్ట్రాల మధ్య కాక రేపుతున్న రాయలసీమ ఎత్తిపోథల పథకం విషయంలోనూ జగన్ రెడ్డి సర్కార్ కు వరుస షాకులు తగులుతున్నాయి. 

తెలంగాణ సర్కార్ చేసిన ఫిర్యాదుతో ప్రాజెక్టు పనులు ఆపాలని ఇప్పటికే కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. రూల్స్ విరుద్ధంగా పనులు చేపడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించింది. జైలుకు వెళ్లాల్సి వస్తుందంటూ ఏపీ సీఎస్ ను ఉద్దేశించి కామెంట్ చేసింది. కృష్ణా ప్రాజెక్టులపై రెండు దెబ్బలకు తోడుగా మరో షాక్ తగిలింది. తాజాగా ఏపీ సర్కారుకు షాకిచ్చింది కేంద్ర పర్యావరణ శాఖ.  రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి పర్యావరణ అనుమతుల్ని వాయిదా వేసింది.ప్రాజెక్టుకు సంబంధించి ఆరు అంశాలపై వివరణ ఇవ్వాలని కోరింది కేంద్ర పర్యావరణ శాఖ. ప్రాజెక్టు స్పష్టమైన డ్రాయింగ్స్.. లేఅవుట్ లు.. చార్ట్ లను ఇవ్వాలని ఏపీ సర్కారుకు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన దరఖాస్తులో స్పష్టత మిస్ అయినట్లుగా చెబుతున్నారు.  రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఎంత నీటిని వాడుకోవాలన్న సమాచారాన్ని కేంద్రం కోరింది. 

మరోవైపు  ఏపీ సర్కారు నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. మంత్రులు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో దివంగత మహా నేత వైఎస్ మొదలు..ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ను ఘాటుగా తిట్టేస్తున్నారు. అయినప్పటికి వైసీపీ నేతలు  మాత్రం ఆచితూచి అన్నట్లుగా స్పందిస్తున్నారే తప్పించి.. తమ సహజ సిద్ధమైన దూకుడును ప్రదర్శించటం లేదు. నోటికి ఎంత మాట వస్తే.. అంత మాట అనేసే తీరును ఏపీ అధికారపక్ష నేతలు అస్సలు ప్రదర్శించటం లేదు.