ధరలు తగ్గించం: సిమెంట్ కంపెనీలు!

 

ప్రస్తుతం మార్కెట్లో సిమెంట్ బస్తా ధర 350 రూపాయల చేరువలో వుంది. సిమెంట్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ గత పది రోజులుగా బిల్డర్లు సిమెంట్ కొనుగోలు చేయకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిమెంట్ ధరలు తగ్గించే ప్రసక్తే లేదని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా వున్న సిమెంట్ కంపెనీల ప్రతినిధులు ప్రకటించారు. సిమెంట్ ధరలను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. సిమెంట్ కంపెనీలకు గత మూడు సంవత్సరాలుగా వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికే సిమెంటు ధరలను పెంచామని, ప్రస్తుతం సిమెంట్ కంపెనీలు సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో వున్నాయని వారు అన్నారు. ఒక సిమెంట్ బస్తా తయారు చేయడానికి తమకు 330 రూపాయలు ఖర్చవుతోందని వారు ఈ సందర్భంగా చెప్పారు. సిమెంట్ ధరల విషయంలో బిల్డర్లు చేస్తున్న వాదనలు సత్యదూరమని వారు అన్నారు. గతంలో తమ దగ్గర వున్న స్టాకును అమ్ముకోవడానికి మాత్రమే సిమెంట్ ధరలు తగ్గించామని, అవే ధరలను ఇప్పటికీ అమలు చేయమంటే కుదరదని సిమెంట్ కంపెనీల ప్రతినిధులు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు.