TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా.. యూపీలో ఏడు దశల్లో పోలింగ్ 

Published on: Sat Jan 8, 2022 5:02PM

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సస్పెన్స్ వీడింది. కొవిడ్ మహమ్మారి విజృంభణలో ఎన్నికలు సమయానికి జరుగుతాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా.. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.  ఫిబ్రవరి 10న తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. యూపీలో ఏడు దశల్లో, మణిపూర్ లో రెండు దశల్లో, మిగిలిన మూడు రాష్ట్రాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఉత్తర ప్రదేశ్‌లో 403, ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60  శాసన సభ స్థానాలు ఉన్నాయి. 

ఉత్తరప్రదేశ్    లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. యూపీ రెండో దశతో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలోని మొత్తం అసెంబ్లీ సీట్లకు ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 27, మార్చి 3 తేదీల్లో మణిపూర్ లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి7న చివరి దశ పోలింగ్ జరగనుండగా... మార్చి 10న కౌంటింగ్ జరిపి ఫలితాలు వెల్లడిస్తారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర  విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల వివరాలు ప్రకటించారు. తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 14న జారీ అవుతుంది. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

యూపీ అసెంబ్లీ పదవి కాలం మే నెలలో ముగియనుంది. మిగితా నాలుగు రాష్ట్రాల  అసెంబ్లీ గడువు మార్చితో ముగియనుంది. కరోనా కాలంలో ఎన్నికల నిర్వహణ సవాళ్లతో కూడుకున్నదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర చెప్పారు. కరోనా దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల నిర్వహణపై కేంద్ర సర్కార్ తో చర్చించామన్నారు. పోలింగ్ శాతాన్ని పెంచాలనే ఉద్దేశంతో పోలింగ్ సమయాన్ని అదనంగా ఓ గంట పొడిగించినట్లు సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. కొవిడ్ వల్ల ఎన్నికల నిర్వహణ భారీ సవాలుగా నిలుస్తోందని తెలిపారు. ఈ ఎన్నికలను కొవిడ్ రహిత ఎన్నికలుగా నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లోని 690 నియోజకవర్గాల్లో కోవిడ్ రహిత, సురక్షిత ఎన్నికలను నిర్వహించడమే తమ లక్ష్యమని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో చర్చించినట్లు తెలిపారు. 

ఈ ఎన్నికల్లో 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు వీరిలో తొలిసారి ఓటు వేయబోతున్నవారు 24.9 లక్షల మంది. 11.4 లక్షల మంది మహిళలు తొలిసారి ఓటు వేయబోతున్నట్లు సీఈసీ తెలిపారు. 16 శాతం పోలింగ్ కేంద్రాలను పెంచుతున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్లను దాఖలు చేయవచ్చునని తెలిపారు. కొవిడ్ పాజిటివ్ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటు వేయవచ్చునని సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు.