పాంచ్ పటాకా.. తెలుగునాట ధమాకా..

దేశంలో మినీ సంగ్రామానికి నగారా మోగింది. నాలుగు రాష్ట్రాలు కేరళ, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు,అస్సాంతో పాటు  కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభ ఎన్నకల గంట మోగింది. వీటితో పాటు 16 రాష్ట్రాల్లోని 34 స్థానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది సీఈసీ. అసోంలో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అసోంలో మార్చి 27న తొలి దశ పోలింగ్ జరగనుంది. తమిళనాడు, కేరళ. పుదిచ్చేరిలో ఒకే దశలో ఏప్రిల్ ఆరున పోలింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది దశలో పోలింగ్ నిర్వహిస్తామని సీఈసీ తెలిపింది. బెంగాల్ లో కూడా మార్చి 27న తొలి దశ పోలింగ్ జరగనుంది. మే2న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రానున్నాయి.మొత్తం 18.68  కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని సీఈసీ సునిల్ అరోరా తెలిపారు. ఆన్ లైన్ లో నామినేషన్లను ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. 

ఈసారి ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలలో నాలుగు వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఈశాన్య భారతంలోని అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంటే, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో వుంది. దక్షిణాన ఎన్నికలు జరిగే కేరళలో వామపక్ష కూటమి, తమిళనాడులో అన్నా డీఎంకే అధికారంలో ఉన్నాయి. పుదుచ్చేరిలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, ఫిరాయింపుల నేపధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలి పోయింది. అక్కడ రాష్ట్ర పతి పాలన విధించారు. 

ఈ ఎన్నికలలో 294 అసెంబ్లీ స్థానాలున్నపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సుమారు మూడు దశాబ్దాల పాటు, రాష్ట్రాన్నిపాలించిన వామపక్ష కూటమి ప్రభుత్వాన్ని2011 ఎన్నికలలో గద్దెదించిన మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ 2016లో వరసగా రెండవసారి కూడా తిరుగులేని విజయాన్ని సాధించింది. రేపటి ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించి హట్రిక్ కొట్టాలని మమతా బెనర్జీ తమదైన శైలిలో రణతంత్రాన్ని రచించుకున్నారు. అయితే, 2019 లోక్ సభ ఎన్నికలలో అనూహ్యంగా పుంజుకుని 40 శాతం ఓట్లతో 18స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. తృణమూల్ కు గట్టి సవాలు విసురుతోంది. మొదటి నుంచి మమతా దీదీకి కుడి ఎడమ భుజంగా ఉన్నసువేందు అధికారి సహా పలువురు కీలక నేతలు, మంత్రులు, సిట్టింగ్,ఎంపీలు,ఎమ్మెల్ల్యేలు బీజీపీలో చేరి మమతకు సవాలు విసురుతున్నారు. 

అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న మరో రాష్ట్రం అస్సాం  చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా వుంది. అయితే 2016లో బీజీపే తొలి సారిగా అక్కడ ఘన విజయం సాధించింది. సర్బానంద్ సోనోవాల్ ముఖ్యమంత్రిగా ఏర్పడిన తొలి బీజేపీ ప్రభుత్వం గడచినా ఐదేళ్ళలో మంచి మార్కులే తెచ్చుకుంది. అన్నిటినీ మించి,కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా, నిలిచిన మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ ఈ సంవత్సరం మొదట్లో కాలం చేశారు. ఆయన స్థానాన్ని భర్తీ చేయగల నాయకుడు ఇంకెవరు హస్తం పార్టీలో లేక పోవడం, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కుంటున్న నాయకత్వ సంక్షోభం నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ
బీజేపీకి పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అదీగాక  గోగోయ్ తర్వాత ఆస్థాయిలో చక్రం తిప్పగల హిమనంద్ బిశ్వాస శర్మ, 2016కు ముందే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి, కాషాయం కట్టుకున్నారు.సో కాంగ్రెస్ బలహీనత ఆధారంగా అస్సాంలో మరోమారు కాషాయ జెండా ఎగిరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

140 స్థానాలున్న కేరళలలో మొదటి నుంచి కాంగ్రెస్ సారధ్యంలోని, యునైట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ , వామపక్షాల నేతృత్వంలోని లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ ల మధ్యనే అధికార మార్పిడి జరుగుతోంది. ఈసారి కూడా ప్రధాన పోటీ రెండు కూటముల మధ్యనే ఉంటుంది. గత ఎన్నికల్లో లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ విజయం సాధించింది. ఈసారి ఏ కూటమిని అధికారం వరిస్తుంది అనేది కొంత ఆసక్తి రేకెత్తిస్తోంది. గత ఎన్నికలలో కేవలం ఒకే ఒక్క సీటుకే పరిమితమైన బీజీపే ఈ సారి ఓటర్లను ఆకర్షించేందుకు సరికొత్త వ్యూహాలను అమలుచేస్తోంది. ఇటీవలే మెట్రో మ్యాన్‌ శ్రీధర్‌ తో పాటుగా కొందరు సినిమా రంగ ప్రముఖులు ఇతరరులు కూడా
పార్టీలో చేరారు. అయితే ఎంత చేసిన కేరళకు సంబంధించినంతరకు బీజేపీ ఆటలో అరటిపండు మాత్రమే.   

దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీలదే పై చేయిగా ఉన్న తమిళనాడులో ప్రస్తుతం  అన్నాడీఎంకే అధికారంలోవుంది. జయలలిత మరణం తర్వాత జరుగుతన్న ఈ ఎన్నికలలో  అన్నాడీఎంకేతో బీజేపీ, డీఎంకేతో కాంగ్రెస్ ఇప్పటికే పొత్తు పెట్టుకున్నాయి. డిఎంకే అగ్రనేత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, అన్నాడీఎంకే  అధినాయకురాలు జయలిత తెర మీద లేకుండా జరుగతున్న ఈ ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ప్రస్తుతానికి ఊహకు కూడా అందని విషయంగా ఉందని అంటున్నారు. 
ఈ నాలుగు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరికి శాసన సభ ఎన్నికలు కూడా చివరి క్షణంలో చేసుకున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అక్కడ నారాయణ స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కారు కుప్పకూలింది. ఎందుకనో గానీ పుదుచ్చేరి మీద కమలనాధుల కన్ను పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కద పర్యటించారు. అలాగే పార్టీ అగ్రనేతలు కూడా తరచూ పుదుచ్చేరిలో పర్యటిస్తూ పార్టీ విస్తరణకు వ్యూహాత్మకంగా పావులు కడుపుతున్నారు. 

సో... దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కి  ఉన్న పరిస్థితులలో జరుగతున్న అసెంబ్లీ ఎన్నికలు, మినీ సంగ్రామాన్ని తలపించడమే కాదు.. దేశ  రాజకీయ భవిష్యత్ నప నిర్ణయించే ఎన్నికలుగా కూడా
బావించ వచ్చును.