ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా

తెలుగు వన్ చెప్పిందే నిజమైంది. తెలుగు రాష్ట్రాల్లో జరగాల్సి ఉన్న శాసనమండలి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఏపీలో మూడు, తెలంగాణలో ఆరు  ఎమ్మెల్యే కోటా మండలి సీట్లు జూన్ తొలి వారంలో ఖాళీ అవుతున్నాయి. ఆ సీట్ల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కొవిడ్ వైరస్‌ తీవ్రత దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండవని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కొవిడ్‌ ఉద్ధృతి తగ్గేవరకు ఏపీ, తెలంగాణలోని 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరపలేమని వెల్లడించింది. ఈ మేరకు ఈసీ ప్రకటన విడుదల చేసింది. పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 

తెలంగాణలో శాసనసభ్యుల కోటా నుంచి మండలికి ఎన్నికైన ఆరుగురు సభ్యుల పదవీకాలం జూన్​ 3న ముగియనుంది. శాసనసభ్యుల కోటా నుంచి పదవీ విరమణ చేయనున్న ఎమ్మెల్సీల జాబితాలో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, ఆకుల లలిత ఉన్నారు. గవర్నర్​కోటాలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్కరి పదవీకాలం  జూన్‌ 16న ముగియనుంది. అయితే ఆ ఎన్నికపై మాత్రం సీఈసీ క్లారిటీ ఇవ్వలేదు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ ఉండదు కాబట్టి.. నిర్వహిస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా ఉంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఖాళీలపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఆ లేఖపై చర్చించిన ఈసీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించరాదనే అభిప్రాయానికి వచ్చింది. 

భారత ఎన్నికల సంఘంపై మద్రాస్‌ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా సెకండ్‌ వేవ్‌ ముంచుకొస్తుంటే.... ఎన్నికల ప్రచార ర్యాలీలకు అనుమతినివ్వడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ర్యాలీలకు అనుమతినిస్తూ...కోవిడ్‌ నిబంధనలు అమలు చేయడంలో విఫలమైన ఇసిపై మర్డర్‌ కేసు పెట్టాలని మద్రాస్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఇన్ని కేసులు పెరిగిపోవడానికి నైతిక, ఏకైక బాధ్యతంతా ఇసిదేనని ఆయన మండిపడ్డారు. 

ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల వల్లే అక్కడ కరోనా కేసులు పెరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సీఈసీ కూడా  కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో కరోనా పరిస్థితులు మెరుపడే వరకు ఎన్నికలు నిర్వహించబోమని స్పష్టం చేసింది. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా పలు కారణాల వల్ల మూడు లోక్‌సభ స్థానాలతో పాటు 8 అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫై చేసింది. ఐతే ప్రస్తుతం  కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఉపఎన్నికలను వాయిదా వేసింది ఈసీ.అందులో భాగంగానే ఏపీ, తెలంగాణలో జరగాల్సిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం.