TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం

Published on: Fri Apr 17, 2026 9:12AM

పశ్చిమ ఆసియా సంక్షోభంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య   కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అగ్రదేశాధినేత  డొనాల్డ్ ట్రంప్   ప్రకటించారు.  కొంతకాలంగా సరిహద్దుల్లో కొనసాగుతున్న భీకర దాడులకు అడ్డుకట్ట వేస్తూ.. పది రోజుల పాటు యుద్ధాన్ని నిలిపివేసేందుకు ఇజ్రాయెల్, లెబనాన్ లు అంగీకరించాయనీ,  అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం గురువారం (ఏప్రిల్ 16)  నుంచే అమల్లోకి వచ్చిందనీ ట్రంప్ తెలిపారు. 

ఈ కీలక పరిణామంపై డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అవున్‌లతో తాను వ్యక్తిగతంగా మాట్లాడానని పేర్కొన్నారు. ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు లెబనాన్‌లో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్న నేపథ్యంలో ఈ కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాల కాలం తర్వాత అమెరికా చొరవతో ఇరు దేశాల ప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చి చర్చలు జరపడం విశేషం.  ఈ ఒప్పందానికి ముందు వాషింగ్టన్‌లో  అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పర్యవేక్షణలో ఇజ్రాయెల్,  లెబనాన్  దౌత్యవేత్తలు ముఖాముఖి చర్చలు జరిపారు. 1980  దశకం తర్వాత ఈ రెండు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు జరగడం ఇదే తొలిసారి. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి, ఇరాన్ జోక్యాన్ని నియంత్రించడమే లక్ష్యంగా అమెరికా ఈ దౌత్యం నెరిపింది.

ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్   వైమానిక,  క్షిపణి దాడుల కారణంగా లెబనాన్‌లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు  2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా,   10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. హెజ్బొల్లా స్థావరాల సాకుతో ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేయడంతో లెబనాన్ ఆర్థిక వ్యవస్థ   చిన్నాభిన్నమైంది. ప్రస్తుత ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ తన దాడులను ఆపివేయాల్సి ఉండగా, హెజ్బొల్లా కూడా సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడకూడదు. 

మరోవైపు..  దక్షిణ లెబనాన్ ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి  తరపున విధులు నిర్వహిస్తున్న భారత సైనికుల భద్రతపై  ఈ ఒప్పందం  ప్రభావం చూపనుంది. ప్రస్తుతం అక్కడ   642 మంది భారత శాంతి భద్రతా సైనికులు సేవలందిస్తున్నారు. యుద్ధం తీవ్రతరమైతే వీరి రక్షణకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున, భారత్ కూడా ఈ  కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నది.  ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ కూడా ట్రంప్ చొరవను అభినందించారు. ఈ ఒప్పందం  శాశ్వత శాంతికి నాంది కావాలని ఆకాంక్షించారు.

ఈ పది రోజుల కాల్పుల విరమణ సమయాన్ని ఉపయోగించుకుని ఇరు దేశాల మధ్య ఉన్న వివాదాలను శాశ్వతంగా పరిష్కరించుకోవాలని అమెరికా భావిస్తోంది. ఒకవేళ ఈ సమయంలో హెజ్బొల్లా నుంచి ఎలాంటి దాడులు జరగకపోతే, ఒప్పందాన్ని మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉందని ట్రంప్ సూచన ప్రాయంగా వెల్లడించారు.  ఇరాన్  నుంచి ఈ ఒప్పందంపై ఇంత వరకూ ఎటువంటి స్పందనా రాలేదు.