TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రావత్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు వాసి..హెలికాప్టర్ ప్రమాదంలో సాయితేజ మృతి 

Published on: Wed Dec 8, 2021 6:54PM

భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్ హెలికాప్టర్ కూలిపోయిన ప్రమాదంలో చనిపోయారు. రావత్ తో పాటు ఆర్మీ హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ వాసి కూడా మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన బి.సాయితేజ అనే లాన్స్ నాయక్ కూడా ఉన్నారు.

సాయితేజ స్వస్థలం చిత్తూరు జిల్లా కురబల కోట మండలం ఎగువ రేగడ గ్రామం. ఆయన 2013లో సైన్యంలో చేరారు. సైన్యంలో లాన్స్ నాయక్ ర్యాంకుకు ఎదిగిన సాయితేజ ప్రస్తుతం బిపిన్ రావత్ కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా కొనసాగుతున్నారు. రావత్ వెంట ఆయన కూడా హెలికాప్టర్ ఎక్కి ప్రమాదానికి గురయ్యారు. సాయి తేజ సోదరుకు కూడా ఆర్మీలోనే ఉన్నారు. ఆయన ప్రస్తుతం సిక్కింలో విధులు నిర్వహిస్తున్నారు. సాయితేజ మరణ వార్తను అతని సోదరుడు తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలుస్తోంది. 

లాన్స్ నాయక్ సాయితేజ మృతితో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సాయితేజకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత సెప్టెంబరులో వినాయకచవితి సందర్భంగా ఆయన చివరిసారి స్వగ్రామానికి వచ్చినట్టు బంధువులు వెల్లడించారు. జనరల్ బిపిన్ రావత్ తో కలిసి ఢిల్లీ నుంచి వెల్లింగ్టన్ వెళ్లడానికి ముందు సాయి తేడ భార్యకు ఫోన్ చేసి మాట్లాడారని చెబుతున్నారు.