TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆ లెక్కల పేపరుతో లెక్కలేనన్ని కష్టాలు

Published on: Wed Mar 16, 2016 2:07PM


ఒక ఏడాది పరీక్షలు రాసేవారికి తేలికపాటి ప్రశ్నాపత్రం, మరో ఏడాది పరీక్ష రాసేవారికి తలవాచిపోయే కొచ్చెన్‌ పేపర్‌ ఇస్తే ఎలా ఉంటుంది. ప్రశ్నాపత్రాన్ని చూడగానే ఏడుపు తన్నుకొస్తుంది. CBSE సిలబస్‌ ప్రకారం ఈసారి పన్నెండో తరగతి లెక్కల పరీక్షకు కూర్చున్నవారి పరిస్థితి ఇలాగే అయ్యింది. ఎప్పుడూ వచ్చే ప్రశ్నాపత్రాలకు భిన్నంగా ఈసారి చాలా కష్టంగా ప్రశ్నాపత్రం ఉందట. ఒక్క మార్కుకి కూడా సుదీర్ఘమైన ప్రశ్నలు ఇవ్వడంతో విద్యార్థులు బిక్కమొగం వేశారు. ఎలాగైనా సరే వంద మార్కలు దక్కుతాయనుకుని పరీక్ష హాల్లో కూర్చున్నవారు కాస్తా, పరీక్ష గట్టెక్కుతామా లేదా అన్న డైలమాలో పడిపోయారు. సుదీర్ఘమైన ప్రశ్నలతో, క్లిష్టమైన జవాబులతో నిండిన ఇలాంటి ప్రశ్నాపత్రాన్ని మునుపెన్నడూ చూడలేదనీ ఉపాధ్యాయులే ఆశ్చర్యపోయారు.

 

ఈసారి పరీక్షలో కష్టమైన ప్రశ్నలే కాకుండా, అసలు తమ సిలబస్‌లో లేనే లేని ప్రశ్నలు ఇచ్చారని, విద్యార్థులు గుడ్లనీరు కుక్కుకున్నారు. పరీక్ష ముగిసిన తరువాత ఏడుస్తూ బయటకు వచ్చిన పిల్లలను చూసిన తల్లిదండ్రులకు కూడా నోట మాటరాలేదు. ఇలాంటి చేష్టలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారనీ, ఈ పేపర్‌ని తీర్చిదిద్దిన వారిని శిక్షించాలనీ తల్లిదండ్రులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి, స్మృతీ ఇరానీకీ లెక్కలేనన్ని విన్నపాలు వెళ్లినట్లు సమాచారం. మరి కొందరైతే ఏకంగా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తున్నారు. CBSE బోర్డు ఈ పరిస్థితికి తక్షణమే స్పందించి ఈసారికి ఉదారంగా పేపరు దిద్దుతుందని అంతా ఆశిస్తున్నారు. అలాగైనా లెక్క సరైతే బాగుండు!