చంద్రబాబు రాఖీ శుభాకాంక్షలు
Published on: Mon Aug 19, 2024 9:49AM
రక్షాబంధన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలుగు మహిళలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తెలుగింటి ఆడపడుచులు, అనునిత్యం ఆశీస్సులు అందజేసే అక్క చెల్లెళ్లకు రాఖీ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. ఆ సందేశంలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఆరంభం నుంచీ కూడా ఆడపడుచుల పక్షపాతి అని గుర్తు చేశారు. మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించినది తెలుగుదేశం ప్రభుత్వమే అని పేర్కొన్నారు.
అలాగే ప్రభుత్వ పరంగా ఇచ్చే పథకాలను, ఆస్తులను మహిళల పేరుపైనే ఇచ్చే విధంగా సంస్కరణ తెచ్చింది కూడా తెలుగుదేశమే అని చంద్రబాబు గుర్తు చేశారు. మహిళా సాధికారత కోసం ‘డ్వాక్రా’ సంఘాలు, బాలికా విద్యకు ప్రోత్సాహం, స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో మహిళా సంక్షేమం కోసం తెలుగుదేశం ఎంతో కృషి చేసిందన్నారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్దికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు.


