TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పేదవాడి అన్నంముద్ద ఎన్టీఆర్.. చంద్రబాబు

Published on: Wed May 28, 2025 10:23AM

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి,  దివంగత నేత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఒక సంఘ సంస్కర్త అని, సంక్షేమానికి సరికొత్త మార్గం చూపిన మహనీయుడని కొనియాడారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ అనే మూడు ప్రాథమిక అవసరాలు తీర్చడమే తన జీవిత లక్ష్యంగా భావించి కృషి చేసిన  ధీరోదాత్తుడు అని పేర్కొన్నారు.  

సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనం పలికిన దార్శనికుడిగా ఎన్టీఆర్ ను అభివర్ణించారు.   ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు కల్పించి వారికి అన్నయ్యారని పేర్కొన్నారు. మండల వ్యవస్థ తీసుకురావడం ద్వారా  పాలనను ప్రజల ముంగిటకు చేర్చిన ఎన్టీఆర్ పక్కా ఇళ్ల నిర్మాణ పథకంతో పేదలకు చేరువయ్యారనీ, అలాగే రెండు రూపాయలకే కిలో బియ్యం అందించి పేదలకు అన్నం ముద్దయ్యారని చంద్రబాబు అన్నారు. తెలుగుజాతి ప్రపంచ ముందు గర్వంగా తలెత్తుకు నిలబడాలన్నదే ఆయన సంకల్పమని చెప్పిన ఆయన... తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఉజ్వలంగా ప్రకాశిస్తోందంటే అందుకు ఎన్టీఆర్ ఆశీస్సులే కారణమన్నారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు నిరంతరం శ్రమించడమే ఎన్టీఆర్ కు ఇచ్చే ఘన నివాళి అని చంద్రబాబు పేర్కొన్నారు.