TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబు హస్తిన పర్యటన.. అమిత్ షాతో కీలక భేటీ.. ఏం జరగబోతోంది?

Published on: Wed May 21, 2025 4:30PM

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం (మే 22) హస్తిన పర్యటనకు వెడుతున్నారు. ఈ సారి ఆయన హస్తినలో మూడు రోజుల పాటు పర్యటిస్తారు.  ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. వీరిరువురి మధ్యా భేటీ శుక్రవారం (మే 23) జరగనుంది. ఈ భేటీలో ప్రాధానంగా మద్యం కుంభకోణం, ఈ మద్యం కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి పాత్ర, అరెస్టు తదితర అంశాలపైనే చర్చ జరిగే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది.   

వైసీపీ హయాంలో  ప్రభుత్వమే మద్యం వ్యాపారం నిర్వహించిన సంగతి తెలిసిందే, చిత్ర విచిత్ర బ్రాండ్లతో అధిక ధరలకు మద్యం విక్రయించడమే కాకుండా.. పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ చెల్లింపులకు అవకాశం లేకుండా మద్యం కొనుగోలు దారులు నగదు చెల్లించే మద్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. మొత్తంగా జగన్ హయాంలో మద్యం విధానంలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో భాగంగా మద్యం కుంభకోణంలో కీలకంగా ఉన్న వారందరినీ దాదాపుగా అరెస్టు చేసింది.  కేసిరెడ్డి చంద్రశేఖరరెడ్డి,  సజ్జల శ్రీధర్ రెడ్డిలను సిట్ అదికారులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. అలాగే ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తదితరులను కూడా విచారించింది. ఈ విచారణలో నిందితుల నుంచి రాబట్టిన వివరాల ఆధారంగా మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు అన్న నిర్ధారణకు సిట్ వచ్చిందని అంటున్నారు.

నిందితులను విచారించిన సందర్భంగా వారు కూడా జగనే అంతిమ లబ్ధిదారు అని వెల్లడించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మద్యం కుంభకోణం కేసులో జగన్ ను కూడా అరెస్టు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.  ఎవరిదాకానో ఎందుకు వైసీపీ శ్రేణులే జగన్ అరెస్టు అనివార్యమని అంటున్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని అయితే.. జగన్ అరెస్టు ఖాయమని చెప్పేశారు. అయితే ప్రభుత్వ కక్ష సాధింపు కోసమే జగన్ ను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నదని ఆరోపించారనుకోండి అది వేరే విషయం. అదలా ఉంటే.. మద్యం కుంభకోణం కేసులో జగన్ అరెస్టు అంటూ తొట్ట తొలుత మాట్లాడినది పేర్నినానే కావడం విశేషం. వైసీపీ శ్రేణులు కూడా జగన్ అరెస్టు తప్పదని దాదాపుగా ఓ అంచనాకు వచ్చాయి. అదే సమయంలో మంగళవారం నాటి కేబినెట్ సమావేశంలోనూ చంద్రబాబు మద్యం కుంభకోణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నాయనీ, మంత్రులూ, ఎమ్మెల్యేలూ ఎవరూ కూడా మద్యం కుంభకోణం విషయంలో అరెస్టులపైనా, దర్యాప్తుపైనా నోరెత్తి మాట్లాడొద్దనీ, అనవసరంగా వైసీపీకి అవకాశం ఇవ్వొద్దనీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలా మాట్లాడటం వల్ల వైసీపీ నేతలు కక్ష సాధింపులతోనే అరెస్టులు అంటూ ప్రచారం చేసే అవకాశం ఇచ్చినట్లౌతుందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో జగన్ అరెస్టు కు అవసరమైన ఆధారాలను సిట్ సేకరించిందన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే  చంద్రబాబు హస్తిన పర్యటన  అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.