ఒక పరాజయం 100 తప్పులు.. టీడీపీని ముంచిన సీబీఎన్ ఆర్మీ

 

టీడీపీ పరాజయానికి కారణమైన వంద తప్పుల్లో సీబీఎన్ ఆర్మీ కూడా ఒకటని చెప్పొచ్చు. ఆర్మీ అంటే యుద్ధం చేసి రక్షణగా ఉండాలి. కానీ ఈ ఆర్మీ అతి చేసి పార్టీ నాశనానికి కారణమైంది. అసలు ఈ ఆర్మీ వల్ల పార్టీకి ఒరిగిందేంటి?. ఎన్నికల ముందు సోషల్ మీడియాలోనూ, బయటా తెగ హడావుడి చేశారు. కానీ ఏం లాభం పట్టుమని పది ఓట్లు కూడా తీసుకురాలేకపోయారు. ఇంకా చెప్పాలంటే ఉన్న ఓట్లనే పార్టీకి దూరం చేశారు.

చంద్రబాబు మీటింగ్ జరిగితే చాలు సీబీఎన్ ఆర్మీ పేరిట కొందరు టీ షర్టులు వేసుకొని వచ్చి హడావుడి చేసేవారు. దాని వాళ్ళ ఏం లాభం పార్టీకి? టీ షర్టులు వేసుకొని గోల చేస్తేనో, బైక్ ర్యాలీలు చేస్తేనో ప్రజలకు మంచి జరుగుతుందా? పార్టీకి ఓట్లు పడతాయా?. ఇవేమి పట్టించుకోకుండా చంద్రబాబు సీబీఎన్ ఆర్మీకి అండగా ఉంటూ వారిని నెత్తిన ఎక్కించుకున్నారు.

ఇంకా ఈ సీబీఎన్ ఆర్మీలో ఒక సామజిక వర్గానికి చెందిన కొందరి అత్యుత్సహం కూడా పార్టీ కొంపముంచింది. బాబు, లోకేష్ లతో చనువుగా ఉంటూ.. పార్టీ మాకే సొంతం అన్నట్టుగా వ్యవహరించడం. మిగతా కార్యకర్తలను చిన్న చూపు చూడటం, కొందరు నేతలను బెదిరించడం చేసేవారు. వీరి వల్ల ఎప్పటినుంచో పార్టీనే నమ్ముకొని నిజాయితీగా పనిచేసిన వారు పార్టీకి దూరం కావాల్సి వచ్చింది. అంతేకాదు ఈ సీబీఎన్ ఆర్మీ మూలంగా తెలుగు యువత, తెలుగు మహిళ, తెలుగు రైతు వంటి టీడీపీ అనుబంధ సంస్థలు మనుగడ కోల్పోయాయి. దీంతో నిజాయితీగా పార్టీ కోసం కష్టపడే వారు, ప్రజా సమస్యల మీద పోరాడేవారు పార్టీకి దూరమై.. టీ షర్టులు వేసుకొని హడావుడి చేసేవారే పార్టీలో ఎక్కువయ్యారు. ఇప్పుడు పార్టీ ఈ పరిస్థితికి రావడానికి కారణమయ్యారు. పోనీ పార్టీ ఓడిపోయాక అయినా తప్పు తెలుసుకొని పార్టీకి పునర్వవైభవం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా అంటే అది లేదు. మాకేం సంబంధం లేదంటూ టీ షర్టులు విప్పేసి సైడ్ అయిపోయారు. ఇకనైనా చంద్రబాబు ఇలా హడావుడి చేసే వారిని కాకుండా.. నిజాయితీగా పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తిస్తే మంచిది.