అమరావతి విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక పక్క కరోనా వైరస్ వ్యాప్తితో తల్లడిల్లుతోంది. అయితే తాజాగా దీనితో పోటీగా అమరావతి రాజధాని అంశం రాష్ట్రంలో తీవ్ర కలకం రేపుతోంది. నిన్న రాష్ట్ర గవర్నర్ మూడు రాజధానుల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. మరీ ముఖ్యంగా అమరావతే రాజధానిగా ఉండాలని మొదటి నుండి గట్టిగా పట్టుపడుతున్న టీడీపీ తన ప్రయత్నాలు ఫెయిల్ అవడంతో తాజాగా మరో కొత్త అస్త్రాన్ని ప్రయోగించబోతున్నట్లుగా తెలుస్తోంది. అదేంటంటే అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు చేసే ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మూడు రాజధానుల అంశానికి వ్యతిరేకంగా రేపు గవర్నర్‌ని కలిసి చంద్రబాబుతో సహా ఎమ్మెల్యేలు అందరు రాజీనామా పత్రాలు అందించనున్నట్లుగా తెలుస్తోంది.

అయితే దీంతో రాజధాని తరలింపు ఆగిపోతుందా అంటే.. ముందుగా టీడీపీ చేసే ఈ ప్రయత్నంతో దేశం మొత్తం దృష్టి ఇటు పడే అవకాశం ఉంటుంది అందులో టీడీపీకి జాతీయ స్థాయిలో ప్రముఖ రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాల ఆధారంగా దేశవ్యాప్త అంశంగా చేసి కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తారని తెలుస్తోంది. అదే విధంగా ఇటు రాష్ట్రంలో కూడా రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆందోళనలకు చేపట్టే అవకాశం ఉంది. ఈ ఉద్యమానికి కృష్ణా, గుంటూరు ప్రజలు పూర్తిగా మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల నుంచి మాత్రం అంతగా దీనికి మద్దతు లభించక పోవచ్చు. ఇప్పటికే గవర్నర్ రాజధాని వికేంద్రీకరణ బిల్లులకు ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ బీటెక్ రవి తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యూహం ఏ విధంగా విజయవంతం అవుతుందో వేచి చూడాలి.