ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇంట్లో సీబీఐ సోదాలు!!
Published on: Thu Oct 8, 2020 5:18PM
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకి సీబీఐ షాకిచ్చింది. హైదరాబాదులోని ఆయన ఇంట్లో సీబీఐ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ నుండి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు ఈ సోదాలు చేస్తోన్నట్టు సమాచారం. ఇండ్ భారత్ కంపెనీతో సహా ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ ల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఉదయం ఆరు గంటల నుండే ఈ సోదాలు జరుగుతున్నట్టు చెబుతున్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను చీట్ చేసిన కేసులో ఈ దాడులు చేస్తున్నారని సమాచారం. రూ.826 కోట్ల లోన్ ఫ్రాడ్ కేసులో సీబీఐ ఈ సోదాలు చేపట్టింది. దీనికి సంబంధించి సెప్టెంబర్ 6న రఘురామ కృష్ణంరాజుపై ఢిల్లీ సీబీఐ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
కాగా, రఘురామ కృష్ణంరాజు వైసీపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచినప్పటికీ.. ఆ పార్టీ విధానాలకు వ్యతిరేకిస్తూ గత కొంతకాలంగా గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన బీజేపీ దగ్గరవ్వడం కోసం వైసీపీపై విమర్శలు చేస్తున్నారని, త్వరలో ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఇంట్లో సీబీఐ సోదాలు జరగడం చర్చనీయాంశమైంది. అదీగాక, సీఎం జగన్ ఢిల్లీ పర్యటన జరిగిన తరుణంలో ఈ సోదాలు జరగడం హాట్ టాపిక్ గా మారింది.


