జగన్ ఫిర్యాదు ఎఫెక్టా...లేకా బాబును కార్నర్ చేసే ప్లానా ?

 

తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ చేసిన బీజేపీ అందుకు అనుగుణంగా తన పని చేసుకుపోతోంది. ఈ నేపధ్యంలో నాయకులకి సన్నిహితంగా మెలిగిన, మెలిగారని ఆరోపణలు ఉన్న అధికారులను కూడా ఫోకస్ చేస్తోంది. ఈ నేపధ్యంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడుగా చెప్పబడుతోన్న జీఎస్టీ సీనియర్ అధికారి బొల్లినేని శ్రీనివాస్ గాంధీపై నిన్న సీబీఐ సోదాలు జరిపింది. 

ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్‌ కార్యాలయాలతో పాటు ఆయన నివాసంలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి రూ. 200 కోట్లు అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో అధికారులు దాడులు చేపట్టారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైన శ్రీనివాస్‌ వద్ద  రూ.4 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. గాంధీతో పాటు ఆయన భార్య బొల్లినేని శిరీషపై కూడా అధికారులు కేసు నమోదు చేశారు. 

అయితే గాంధీ ఇంతకు ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో పని చేశారు. వైసీపీ అధినేత జగన్, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిలపై ఈడీ కేసులు నమోదు చేసింది గాంధీనే కావడం ఇప్పుడు పలు చర్చలకు తావిస్తోంది. ఎందుకంటే 2017… ఫిబ్రవరిలో మోడీని కలిసిన అప్పటి ప్రతిపక్ష నేత టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని అప్పటి ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో ఉన్న బొల్లినేని గాంధీతోపాటు ఈడీ జాయింట్ డైరెక్టర్ ఉమాశంకర్ గౌడ్‌ల‌పై జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు. 

టీడీపీ ప్రోద్బలంతోనే గాంధీ తనపై తప్పుడు కేసులని బనాయించారని మోడీకి రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు. అంతేకాక ఈడీ కేసులతో ఏమాత్రం సంబంధం లేని తన భార్య భారతికి కూడా నోటీసులు జారీ చేశారని అందుకే ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రధానిని జగన్ కోరారు. అయితే అప్పట్లోనే జగన్ ఆరోపణల కారణంగానే గాంధీ జీఎస్టీకి బదిలీ అయ్యారని అనుకునేవారు. తొలుత డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌లో పదేళ్లపాటు పని చేసిన గాంధీ తర్వాత ఈడీలో ఏడేళ్లపాటు పని చేశారు. 

జగన్ కేసు తర్వాత ఆయన జీఎస్టీకి బదిలీ అయ్యారు, ఇక రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి సంబంధించిన కేసులో చంద్రబాబు సూచనల మేరకు పలు ఫైళ్లల్లో మార్పులు చేసినట్టు కూడా ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. గతంలో హైదరాబాద్‌ ఈడీ కార్యాలయం నుంచి బదిలీ అయినా అనధికారికంగా నెలరోజుల పాటు విధుల్లో కొనసాగారని కూడా ఈయన మెడ ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ నోట్ చేసుకుని ఓకే సారి రంగంలోకి దిగింది సీబీఐ. అయితే ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో బొల్లినేనిపై సీబీఐ కేసు అనేది తీవ్ర చర్చనీయామాశంగా మారింది, అయితే ఈ సీబీఐ దాడులు ఇక్కడితో ఆగుతాయా ? లేక ఇంకా ఎవరినైనా టార్గెట్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.