అయేషా హత్య కేసు..సత్యంబాబును విచారిస్తున్న సీబీఐ

 

సంచలనం సృష్టించిన నర్సింగ్‌ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసు విచారణను సీబీఐ వేగంవంతం చేసింది. ఈరోజు ఉదయం కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చేరుకున్న సీబీఐ బృందం సత్యం బాబును విచారిస్తోంది. సత్యంబాబు ఇంట్లోని ఓ గదిలో విచారణ జరుగుతోంది. సత్యం బాబు కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్‌ను కూడా సీబీఐ అధికారులు రికార్డ్ చేసుకుంటున్నారు. కాగా మీడియాని లోపలికి అనుమతించేందుకు అధికారులు నిరాకరించారు. మరోవైపు ఇబ్రహీంపట్నం శ్రీ దుర్గా హాస్టల్ నిర్వాహకులను కూడా సీబీఐ అధికారులు విచారించనున్నారు. ఆయేషా మీరా హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కున్న సత్యంబాబు దాదాపు 8 సంవత్సరాల పాటు జైలు శిక్షను అనుభవించి ఆ తరువాత నిర్దోషిగా విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో అసలు నిందితులను పట్టుకోవటంలో ఏపీ పోలీసులు విఫలమవ్వటంతో హైకోర్టు ఈ కేసును సీబీఐకి బదిలీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు అయేషా మీరా హత్య కేసుపై మళ్ళీ విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు.. విజయవాడ కోర్టుకు చెందిన ముగ్గురు కోర్టు సిబ్బందిపై కేసు నమోదు చేశారు. కేసు డాక్యుమెంట్లు, సాక్ష్యాలు ధ్వంసం అయిన అంశంపై పి.కుమారి, పి. వెంకటకుమార్‌, వై సుబ్బారెడ్డిలపై కేసు​ నమోదు చేశారు.