అయేషా కేసు..మంత్రి మనవడిని విచారించిన సీబీఐ

 

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉండి నిర్దోషిగా బయటపడిన సత్యంబాబును ఆరు గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ బృందం... హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణాజిల్లా గూడవల్లి గ్రామ మాజీ సర్పంచ్, మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్‌బాబును 14 గంటల పాటు సూదీర్ఘంగా విచారించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన కోనేరు సతీష్.. ఆయేషా హత్య కేసులో సీబీఐ అధికారులు తనని విచారించారని, ఇంటిలో సోదాలు చేసి హార్డ్ డిస్క్‌, కొన్ని సీడీలు తీసుకెళ్లినట్టు వెల్లడించారు. ఈ కేసులో నార్కో ఎనాలసిస్ టెస్టుకు కూడా తాను సహకరిస్తానని తెలిపారు. హత్య జరిగిన రోజు నేను హైదరాబాద్‌లో ఉన్నానని అన్నారు. ఆ సమయంలో సతీష్ తాతా కోనేరు రంగారావు మంత్రిగా ఉండటంతో కేసును మేనేజ్ చేశారని వచ్చిన ఆరోపణనలపై ఆయన మండిపడ్డారు. ఈ కేసుతో నేను ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక క్షోభతోనే మా తాత, అమ్మ మృతిచెందారన్నారు. నేను ఈ కేసులో నిర్ధోషిణి, సీబీఐ విచారణలో కూడా ఇదే తేలుతుందన్నారు.

మరోవైపు తల్లిని, చెల్లిని చంపుతామని పోలీసులు బెదిరించడంతోనే అయేషా హత్య కేసులో తాను నేరం ఒప్పుకోవాల్సి వచ్చిందని సత్యంబాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ ముందు హాజరైన సత్యంబాబు అనంతరం మీడియాతో మాట్లాడాడు. తాను నేరం అంగీకరించకపోతే ఎన్‌కౌంటర్‌ చేస్తానని పోలీసులు బెదిరించారని తెలిపాడు. నిర్భయ కేసులో ఏ విధంగా న్యాయం జరిగిందో అదే విధంగా ఆయేషా హత్య కేసులో కూడా న్యాయం జరగాలని, దీనికోసం సీబీఐ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పాడు. ఈ రోజు విచారణలో సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని పేర్కొన్నాడు.