అలోక్ కి ఉద్వాసన..పోలీసుల ఆధీనంలో సీబీఐ

 

అలోక్‌ వర్మను సీబీఐ డైరెక్టర్‌ పదవి నుంచి మరోసారి బదిలీ చేస్తూ ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. గురువారం రాత్రి దిల్లీ పోలీసులు సీబీఐ కేంద్ర కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సీబీఐ కార్యాలయం పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం.నాగేశ్వరరావుకు కేంద్రం బాధ్యతలు అప్పగించింది. సీబీఐ కొత్త డైరెక్టర్‌ను నియమించే వరకు లేదా తుది ఉత్తర్వులు వెలువడే వరకు నాగేశ్వరరావు బాధ్యతలు నిర్వహిస్తారు. 

సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ వ్యవహారంలో సీవీసీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు పక్కనబెట్టింది. సీబీఐ డైరెక్టర్‌ పదవి నుంచి ఆలోక్‌ వర్మను తప్పించడాన్ని తప్పుబట్టింది. ఆలోక్‌వర్మకు తిరిగి బాధ్యతలను అప్పగించాలని.. నిర్ణయాన్ని సెలక్ట్ ప్యానల్‌కు పంపాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ నివాసంలో ఉన్నతస్థాయి కమిటీ సమావేశమైంది. ఇందులో ప్రధానితోపాటు లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.కె.సిక్రి సభ్యులుగా ఉన్నారు. దాదాపు సమావేశం రెండు గంటలపాటు సాగింది.  ఆలోక్‌పై అవినీతి, విధులు పట్ల అలసత్వం వంటి ఆరోపణలున్నట్లు కేంద్ర నిఘా కమిషన్‌(సీవీసీ) నివేదిక ఇవ్వటంతో కమిటీ ఆలోక్‌ వర్మను పదవి నుంచి తప్పించింది. 

కమిటీలో సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే వ్యతిరేకించారు. సీవీసీ చేసిన ఆరోపణలపై వాదన వినిపించుకునేందుకు ఆలోక్‌కు అవకాశమివ్వాలని ఖర్గే పట్టుబట్టారు. అందుకు మోడీ, జస్టిస్‌ సిక్రి నిరాకరించారు. ఆలోక్‌ చిత్తశుద్ధి కనబర్చడం లేదని, ఆయనపై కొన్ని కేసుల్లో క్రిమినల్‌ దర్యాప్తు అవసరమని వారిద్దరు అభిప్రాయపడ్డట్లు తెలిసింది. దీంతో మెజారిటీ(2-1) ప్రాతిపదికన ఆలోక్‌ను తప్పించారు. అనంతరం సీబీఐ పగ్గాలను తాత్కాలికంగా అదనపు డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావుకు ప్రభుత్వం అప్పగించింది. ఆలోక్‌ వర్మను కేంద్ర హోంశాఖ పరిధిలో అగ్నిమాపక సేవలు, సివిల్‌ డిఫెన్స్‌, హోంగార్డుల డైరెక్టర్‌ జనరల్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 55 ఏళ్ల సీబీఐ చరిత్రలో తొలిసారిగా ఒక డైరెక్టర్‌ ఉద్వాసనకు గురయ్యారు.