TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కె.వి.పి. పై కన్నేసిన సిబీఐ

Published on: Thu May 17, 2012 8:55AM

జగన్ అక్రమాస్తుల కేసులో సిబీఐ తరువాతి టార్గెట్ కె.వి.పి. రామచంద్రారావేనని తెలుస్తోంది. వై.ఎస్. రాజశేఖర రెడ్డికి ఆత్మలాంటి కె.వి.పి. అప్పట్లో జరిగిన ముడుపుల భాగోతాల్లో ప్రధాన పాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు సిబీఐ ఇలాంటి కీలకమైన వ్యక్తి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం తెలంగాణా రాష్ట్ర సమితికి చెందిన కొందరు లాయర్లు సిబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణను కలుసుకుని కె.వి.పి.కి వ్యతిరేకంగా తమ వద్ద ఉన్న ఆధారాలు అందజేశారు. అంతేకాక ఆయనను విచారణకు పిలవాలని, అలా పిలవకపోతే ఈ దర్యాప్తుకు అర్థం లేదని కూడా అన్నారు. దీనికి లక్ష్మీనారాయణ స్పందిస్తూ ఈ కేసులో నిందితులెవరినీ విడిచిపెట్టబోమని హామీ ఇచ్చారు. కె.వి.పి. గురించి ప్రస్తావిస్తూ సమీప భవిష్యత్ లో ఆయనను విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలిపారు.

 

అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన జగన్ ను అరెస్ట్ చేసే ముందు కె.వి.పి. రామచంద్రారావును విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వై.ఎస్. హయాంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కె.వి.పి. రామచంద్రారావు ముఖ్యమైన ఫైళ్ళను పరిశీలించేవారు. ఆయన పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే వాటికి మోక్షం లభించేది. దీనికి తోడు వై.ఎస్. లావాదేవీలన్నీ కె.వి.పి. రామచంద్రారావు స్వయంగా పరిశీలించేవారు. ఇలాంటి కీలకమైన వ్యక్తిని విచారించకుండా వదిలేస్తే లేనిపోని అపవాదులు కూడా ఎదుర్కోవలసి ఉంటుందని, అందువల్ల ఆయన్ను కూడా విచారించాలని సిబీఐ భావిస్తున్నట్లు తెలిసింది.