సి.బి.ఐ. లక్ష్మీ నారాయణకు సెలబ్రటీ హోదా !
Published on: Mon Jun 4, 2012 7:19PM
సిబిఐలో షాడో టీమ్ ఉందా? జెడి లక్ష్మీ నారాయణే దీన్ని ఏర్పాటు చేశారా? దీని విధివిధానాలు ఏమిటీ? వంటి పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు సిబిఐ జడ్జి పట్టాభిరామారావుపై చేసిన ఇన్ వెష్టిగేషనే సమాధానమిస్తోంది. నేరనియంత్రణ విభాగంలో సిబిఐకు దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నతస్థానాన్ని జెడి నిలబెట్టారని ఆయనను పలువురు కొనియాడుతున్నారు.
గతనెల 23న మంత్రి మోపిదేవి వెంకటరమణ విచారణ, 24న నిమ్మగడ్డ ప్రసాద్ పై విచారణ, 27న జగన్ అరెస్టు వంటి సంచలన వ్యవహారాల్లో తల మునకలవుతూనే జెడి లక్ష్మినారాయణ తన షాడో టీమ్ కు పని కల్పించారు. ఆ టీమ్ కర్నాటక మంత్రి గాలిజనార్దనరెడ్డి బెయిల్ స్కాంను బయటపెట్టింది. దాని పూర్తి ఆధారాలు సేకరించటంలో షాడో టీమ్ విజయం సాధించినా హైకోర్టు ప్రధానన్యామమూర్తి ముందు పూర్తి ఆధారాలు చూపి అనుమతి పొందాకనే జెడి మీడియా ముందుకు వచ్చి బెయిల్ స్కాం ఉదంతాన్ని వెల్లడించారు. ఒకవైపు సిబిఐకు అనుమతి ఇస్తూనే మరోవైపు పట్టాభిరామారావుని సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు పంపించింది.
ఈ సంచలన కేసులో షాడో టీమ్ ఎలా పనిచేసిందో ఒక్కసారిగా గమనించాలి. జెడి తన పనిలో తానుండగా షాడో టీమ్ కర్ణాటకలోనూ, ఆంధ్రాలోనూ ఆధారాలు సేకరించింది. దీనికి కారణం కూడా జగన్ అక్రమాస్తుల కేసులో ఉచ్చు బిగుస్తున్న ఈ తరుణంలో గాలికి బెయిల్ ఎలా ఇచ్చారని కొందరు న్యాయనిపుణులు జెడి లక్ష్మినారాయణను ప్రశ్నించటంతో ఈ బెయిల్ స్కాం వెలుగులోకి వచ్చింది. నిందితులు కూడా నెట్ వర్క్ చేసుకుని తన కార్యక్రమాలు పరిశీలిస్తారని అనుకున్న జెడి దర్యాప్తు జరుగుతున్నంత కాలం దిల్ కుషాలోని సిబిఐ కార్యాలయానికి, ఇంటికి మాత్రమే వెడుతూ షాడో బృందానికి సూచనలిచ్చారు. ఈ బృంద సభ్యులు జెడి ఇచ్చిన వివరాల ప్రకారం ఆధారాలు సేకరిస్తూ కార్యాలయ పనిగంటలు ముగిశాక తమ పని నివేదికలు తెలియజేసింది. హైకోర్టు జడ్జిని కలిసిన తరువాతే ఈ స్కాం వివరాలను జెడి బయటపెట్టారు.
సిబిఐకు ఉన్న రహస్య విభాగాన్నే షాడో టీమ్ అంటారు. ఈ టీమ్ లో ఎవరు ఎప్పుడు ఎక్కడ దర్యాప్తు చేస్తారో ఉన్నతాధికారి అయిన జెడికి తప్ప మిగిలిన వారికి తెలియదు. సాక్షాత్తు జడ్జి అవినీతినే బహిర్గతం చేసిన ఈ టీమ్ తొలి ప్రయత్నమే విజయవంతం కావటంతో ప్రభుత్వం ఇటువంటి ఆపరేషన్లకు ప్రోత్సాహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఆపరేషన్ విధానాన్ని చూసిన వారందరూ మాత్రం హ్యాట్సాఫ్ జెడి అని కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన త్వరలో సెలబ్రటీ హోదా పొందినా ఆశ్చర్యపోనక్కరలేదు.


