మా బాబాయ్ ని చంపింది మా వాళ్లే.. షర్మిల సాక్ష్యం
Published on: Fri Jul 21, 2023 5:10PM
.webp)
మాజీ మంత్రి, ముఖ్యమంత్రి జగన్ సొంత బాబాయ్ హత్య కేసులో సీబీఐ జగన్ సోదరి షర్మిలను సాక్షిగా సీబీఐ పేర్కొంది. ఈ మేరకు ఆమెను ఈ కేసులో 259వ సాక్షిగా చేరుస్తూ సీబీఐ కోర్టుకు దర్యాప్తు సంస్థ వాంగ్మూలం ఇచ్చింది. కాగా ఈ కేసులో షర్మిల గత ఏడాది అక్టోబర్ లో ఢిల్లీ వెళ్లి మరీ సీబీఐ కి వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే.
వాస్తవానికి ఏపీ సీఎం జగన్ అరాచకాలను రాష్ట్ర ప్రజలే కాదు.. సోంత కుటుంబీకులు కూడా భరించ లేకపోతున్నారు. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత అన్న సీఎంగా ఉన్న రాష్ట్రంలో తన తండి హత్య కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగదంటూ వేరే రాష్ట్రానికి మార్చాలని సుప్రీంను ఆశ్రయించి తెలంగాణకు మార్పించుకున్న సంగతి తెలిసిందే. అలాగే సొంత చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ కూడా జగన్ తో పార్టీతో పూర్తిగా తెగతెంపులు చేసుకుని ఆయనకు దూరంగా పొరుగు రాష్ట్రం తెలంగాణలో గడుపుతున్నారు. జగన్ పార్టీకి గౌరవాధ్యక్షురాలి పదవికి హోదాకీ రాజీనామా చేసి మరీ తల్లి విజయమ్మ కుమార్తె వద్దకు తెలంగాణకు వెళ్లి పోయారు. ఆ తరువాత ఏదో అవసరం ఉండి అమరావతి వెళ్లినా జగన్ నివాసానికి కూడా విజయమ్మ వెళ్ల లేదు.
ఇక అన్న జగన్ తో విభేదించి తెలంగాణలో సొంత పార్టీ ఏర్పాటు చేసుకుని తండ్రి ఆశయాల సాధన కోసం అంటూ తన రాజకీయాలు తాను చేసుకుంటున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా సోదరుడు జగన్ తీరుపై నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు కూడా. మొత్తం మీద సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్ కు సొంత కుటుంబ సభ్యులూ దూరం అయ్యారన్నది నిష్టురంగా వినిపించినా కాదనలేని సత్యం. ఇక సొంత బాబాయ్ హత్య కేసు విషయంలో వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల పని గట్టుకుని ఢిల్లీకి వెళ్లి మరీ సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు.
ఆ వాంగ్మూలంలో ఆమె ఏపీ ప్రభుత్వం, అన్న జగన్, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సమీప బంధువు అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి ఏం చెబుతున్నారో దానికి పూర్తి విరుద్ధంగా చెప్పారు. వివేకా హత్య వెనుక ఉన్నది రాజకీయ కారణాలేనని కుండబద్దలు కొట్టేశారు. తమ కుటుంబంలో జరిగిన అత్యంత దారుణ, విషాద ఘటన బాబాయ్ వివేకా హత్యేనని షర్మిల చెప్పారు. ఆయనను హత్య చేసిన వారెవరో తెలియాలనీ, వారికి శిక్ష పడాలనీ అన్నారు. కడప ఎంపీ టికెట్ కోసమే వివేకా హత్య జరిగిందని, అది వాస్తవమని, అందులో ఎలాంటి సందేహాలకూ తావులేదనీ విస్పష్టంగా చెప్పారు. ఆమె తన వాంగ్మూలం ద్వారా ఈ హత్య వెనుక అవినాష్ ఉన్నారని పరోక్షంగానైనా స్పష్టంగానే చెప్పారు. వివేకా హత్య కేసులో నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారనీ, అడుగడుగునా దర్యాప్తును అడ్డుకుంటున్నారనీ అన్న షర్మిల తన సోదరి సునీతకు న్యాయం జరగాలన్నారు. ఈ హత్య కేసు దర్యాప్తు ఏపీలో అయితే నిష్పాక్షికంగా జరగదన్న ఆమె అభిప్రాయంతో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ కూడా ఏకీభవించడం.. సుప్రీం కోర్టుకు కూడా అదే నివేదించడం తో తెలంగాణకు మారిన తరువాత ఈ కేసులో వాస్తవాలు బయటకు వస్తాయని అంతా భావించారు. షర్మిల వాంగ్మూలం నేపథ్యంలో అవినాష్ పై వచ్చిన ఆరోపణలకు బలం చేకూరింది కూడా. అయితే సీబీఐ తెలంగాణకు కేసు విచారణ బదలీ అయ్యాకా.. లాజికల్ ఎండ్ దిశగా దర్యాప్తును వేగవంతం చేసిందన్న భావన అందరిలో కలిగింది. అయితే కారణాలేమిటన్నది తెలియదు కానీ దర్యాప్తునకు గడువు ముగింపునకు వచ్చిన సమయంలో సీబీఐ ఒక్క సారిగా చేతులెత్తేసిన విధంగా వ్యవహరించింది. అన్నిటి కంటే ముఖ్యంగా అవినాష్ అరెస్టు విషయంలో సీబీఐ ఆయనతో దాగుడుమూతలాడిందే తప్ప అరెస్టు చేయడానికి ముందుకు సాగలేదు. చివరాఖరికి కోర్టుల రక్షణ కూడా లేని సందర్భంలో కూడా అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా.. ఆయనకు ముందస్తు బెయిలు వచ్చే విధంగా వ్యవహరించిందని న్యాయ నిపుణుులు కూడా అప్పట్లో వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా సీబీఐ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో అలాగే ఈ ఛార్జిషీట్లో వివేకా హత్యకు కుట్ర పన్నింది కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డే అన్న విషయాన్ని మరోసారి ప్రస్తావించింది. గతంలో దాఖలు చేసిన ఛార్జిషీట్లలోనూ వీరి పేర్లు పేర్కొన్నా ఈసారి వీరిని ఏ 7, ఏ8లుగా పేర్కొంది. ఇక 259వ సాక్షిగా షర్మిలను చేర్చడమే ప్రాధాన్యత సంతరించుకుంది. దర్యాప్తు ముగింపు గడువు తీరిపోవడంతో సీబీఐ ఇప్పటి వరకూ తన దర్యాప్తు వివరాలను చార్జిషిట్ ద్వారా కోర్టుకు సమర్పించి చేతులు దులిపేసుకున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.


