వివేకా హత్య కేసులో ట్విస్ట్.. సీబీఐకి కీలక ఆధారాలు లభ్యం

మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. పలువురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. నిన్న ఇద్దరు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకొని సీబీఐ అధికారులు విచారించారు. ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుడు, యురేనీయం కర్మగారంలో ఉద్యోగి ఉదయ్ కుమార్ రెడ్డి ఫోన్ సీబీఐ బృందం స్వాధీనం చేసుకుంది.

 

పులివెందులకు చెందిన చెప్పుల వ్యాపారి మున్నా. అతడి కుటుంబ సభ్యులను సీబీఐ అధికారులు విచారించారు. అయితే మున్నా బ్యాంక్‌ లాకర్‌లో 48 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని అధికారులు గుర్తించారు. ఇదేకాకుండా మరికొన్ని బ్యాంకులలో 20 లక్షల ఎఫ్‌డీలు కూడా ఉన్నట్లు తెలుసుకున్నారు. అతని బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసి.. నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.

 

గతంలో మున్నా ఫ్యామిలీ పంచాయితీలో వైఎస్ వివేకా కలగజేసుకున్నట్లు సమాచారం. మున్నా ముగ్గురిని వివాహం చేసుకోగా భార్య భర్తల పంచాయితీ వివేకా వద్దకు రావడంతో అప్పట్లో మున్నాను వివేకా మందలిచినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మున్నా మొదటి భార్యను విచారించి అనంతరం అనంతపురం జిల్లా కదిరిలో నివాసం ఉంటున్న మున్నా ఇంటికి వెళ్లి.. అతడి తల్లి సమక్షంలో బ్యాంక్ లాకర్ తెరిచి అందులో ఉన్న నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే, మున్నా సన్నిహితులను, స్నేహితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.