ఆస్పత్రిపాలైన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్
Published on: Sat Sep 6, 2025 2:39PM
.webp)
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారిక పర్యటన కోసం శుక్రవారం (సెప్టెంబర్ 5) హైదరాబాద్ చేరుకున్న ఆయన శనివారం (సెప్టెంబర్ 6) ఉదయం శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అక్కడ నుంచి హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటిన్ విడుదల చేయాల్సి ఉంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ శనివారం (సెప్టెంబర్ 6) హైదరాబాద్ లో పలు కార్యక్రమాలలో పాల్గొనాల్సి ఉంది. ముఖ్యంగా అత్యంత కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై తెలంగాణ సర్కార్ లేఖ మేరకు సీబీఐ దర్యాప్తు టేకప్ చేయడంపై అధికారులతో చర్చించాల్సి ఉంది. దీంతో ఆయన కార్యక్రమాలన్నీ రద్దైనట్లు తెలుస్తోంది.


