TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ పై సీబీఐ కోర్టు అసహనం.. ఏం జరగనుందో? 

Published on: Wed Dec 22, 2021 7:57AM

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో మంగళవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.  కేసు విచారణ సందర్భంగా సీఎం జగన్ పై సీబీఐ కోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణకు సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరడం పట్ల తీవ్రంగా స్పందించింది. ప్రతిసారి మినహాయింపు కోరుతున్నారని అసంతృప్తి వెలిబుచ్చింది. విచారణకు ఎందుకు హాజరు కావడంలేదని సీబీఐ న్యాయస్థానం ప్రశ్నించింది.అందుకు సీఎం జగన్ తరఫు న్యాయవాది స్పందిస్తూ... హాజరు మినహాయింపుపై తెలంగాణ హైకోర్టును కోరామని వివరణ ఇచ్చారు. త్వరలోనే తెలంగాణ హైకోర్టులో దీనిపై తీర్పు రానుందని వెల్లడించారు. అనంతరం సీబీఐ కోర్టు స్పందిస్తూ... దీనిపై వివరాలను మెమో రూపంలో సమర్పించాలని జగన్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు జగన్ న్యాయవాది వెంటనే మెమో దాఖలు చేశారు.

గతంలో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ కోరగా, సీబీఐ కోర్టు ఆయన విజ్ఞప్తిని తిరస్కరించింది. దాంతో సీఎం జగన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు దీనిపై వాదోపవాదాలు ముగించి తీర్పును రిజర్వ్ లో ఉంచింది. సీబీఐ కోర్టు తాజాగా అసహనం వ్యక్తం చేయడంతో జగన్ కేసులో ఏం జరగబోతుందన్న ఆసక్తి నెలకొంది. కోర్టు విచారణకు సీఎం జగన్ హాజరు కావాల్సిందేనని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇస్తే కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు.