TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్‌ మెడపై మరో కత్తి..

Published on: Mon Aug 1, 2016 2:43PM

తనకున్న అధికారంతో కొడుకుని కుబేరుణ్ణి చేయడమే లక్ష్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జమానాలో సాగించిన అక్రమకాండలో మిస్సైన పేజీలను సీబీఐ వెతుకుతోంది. నాకది..నీకిది తరహాలో కొందరికి లబ్థి చేకూర్చి..ఆయా సంస్థలు పరోక్షంగా వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి స్థాపించిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టేలా వైఎస్ తెరవెనుక చక్రం తిప్పారు. అలా ఇప్పటికే ఎన్నో సంస్థలను, ఎందరో పేర్లను సీబీఐ బయట పెట్టింది. అయినప్పటికి బావిలో నీళ్లు ఊరినట్టు జగన్ అక్రమాస్తుల కేసులో ఇంకా దోషులు బయటపడుతూనే ఉన్నారు.

 

అలాంటి వాటిలో ఒకటి పెన్నా భూముల అంశం.  సున్నపురాయి నిక్షేపాల లీజుల కేటాయింపులో పెన్నా సిమెంట్స్‌కు అనుకూలంగా వ్యవహరించారనే అభియోగంతో సీబీఐ మరో ఛార్జీషీటు దాఖలు చేసింది. ఇందులో పెన్నా సిమెంట్స్‌కు భూముల కేటాయింపులో జరిగిన అక్రమాలను పేర్కొంది. అనంతపురం జిల్లా యాడికి మండలంలోని బోయరెడ్డిపల్లె, కమలపాడు, కుంధనకోట, గుడిపాడు, మిట్టూరు గ్రామాల పరిధిలోని 230 ఎకరాల భూమిని 2006లో రైతుల నుంచి బలవంతంగా లాక్కొన్నారు. పెన్నా సిమెంట్స్ పరిశ్రమ ఏర్పడితే మీకు దారులు మూసుకుపోతాయనీ..తర్వాత అవి ఎందుకూ పనికి రావని భయపెట్టో, బెదిరించో ఎకరా రూ.20 వేల నుంచి రూ.60 వేల వరకు ఇచ్చి భూములు తీసుకున్నారు. రికార్డుల్లో మాత్రం రైతులంతా ఆ భూములు సాగుయోగ్యం కాదని వెనక్కి ఇచ్చినట్లు చూపించారు. తర్వాత వాటిని పెన్నా సిమెంట్స్‌కు కేటాయించారు అధికారులు.

 

భూములను రైతుల నుంచి సేకరించడం, వాటిని పెన్నాకు కట్టబెట్టడంలో అప్పటి యాడికి తహసీల్దార్ ఎల్లమ్మ, డీఆర్‌వ్వో సుదర్శన్ రెడ్డి కీలకపాత్ర పోషించినట్లు తేలింది. తమకు ఈ లబ్ధి చేకూర్చిన వైఎస్ రుణం సదరు పెన్నా యాజమాన్యం వెంటనే తీర్చేసుకుంది. జగన్ కంపెనీల్లో పెన్నా గ్రూప్ దాదాపు 68 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టింది. నిబంధనల ప్రకారం తొలుత ఆ భూములకు ప్రభుత్వం తరపున నోటిఫికేషన్ జారీ చేసి రైతులకు పరిహారం కింద ఎంత చెల్లించాలో ధర నిర్ణయించాలి. ఈ విధంగా భూసేకరణ జరిగాక పెన్నా సిమెంట్స్‌కు కేటాయించాలి. అలాగే ఈ భూములు పెన్నా సిమెంట్స్‌కు కేటాయించే సమయంలో సంబంధిత దస్త్రాలను డీఆర్వో నుంచి సంయుక్త కలెక్టర్‌, కలెక్టర్ పరిశీలించి సీసీఎల్ఏకు పంపాలి..కానీ డీఆర్వో సుదర్శన్ రెడ్డి ఫైలును నేరుగా సీసీఎల్ఏకు పంపారు. ప్రభుత్వ ఉద్యోగులై ఉండి, నిబంధనలు పాటించకుండా ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చినట్టు తేలడంతో తహసీల్దార్ ఎల్లమ్మ, డీఆర్వో సుదర్శన్ రెడ్డిలను జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులుగా చేర్చారు. అలాగే అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలను కూడా ఛార్జీషీటులో చేర్చారు.