పులివెందుల కోర్టుకు శివశంకర్ రెడ్డి.. అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నిస్తుందా?
Published on: Thu Nov 18, 2021 11:18AM
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. వివేకా కారు డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్ మెంట్ ఆధారంగా సీీబఐ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో కీలక అనుమానితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహితుడు, వైసీపీ నేత, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ హైదరాబాద్ లో అరెస్ట్ చేసింది. బుధవారం శివశంకర్ రెడ్డిని అదుపులోనికి తీసుకున్న సీబీఐ.. ఉస్మానియాలో వైద్యపరీక్షల తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచింది. తర్వాత ట్రాన్సిట్ వారెంట్‌పై శివశంకర్‌రెడ్డిని కడపకు తరలించింది సీబీఐ. పులివెందుల కోర్టులో శివశంకర్‌రెడ్డిని హాజరుపరచనుంది.
మరోవైపు వివేకా హత్య కేసులో అరెస్ట్ అయిన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి... సీబీఐకి లేఖ రాశారు. వివేకా హత్యకేసులో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ‘‘మూడు రోజుల కిందటే మా నాన్న భుజానికి ఆపరేషన్ జరిగింది. మా నాన్న భుజానికి ఇంకా నొప్పి ఉంది. ఆయన పనులు ఆయన చేసుకోలేక పోతున్నారు. మాకు న్యాయం చేయాలని’’ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి లేఖలో కోరారు.


