TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వివేకా హత్య కేసులో అవినాష్ ప్రధాన అనుచరుడి అరెస్ట్

Published on: Fri Apr 14, 2023 11:52AM

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులు సంబంధించి వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు శుక్రవారం (ఏప్రిల్ 14) ఉదయం అరెస్టు చేశారు.  దీంతో ఏపీ సీఎం జగన్ రెడ్డి సొంత చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్టేనా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  

పులివెందులలో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని అదుపులోనికి తీసుకున్న సీబీఐ అధికారులు ఆయనను అక్కడి నుంచి కడప సెంట్రల్ జైల్లోని గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లి విచారణ జరిపారు. అనంతరం ఆయనను  సీబీఐ కోర్టులో హాజరుపరిచేందుకు   హైదరాబాద్ కు తరలించారు. ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులకు సీబీఐ అధికారులు సమాచారం ఇచ్చారు.  ఇలా ఉండగా.. నాలుగేళ్ల కిందట వివేకా హత్య జరిగిన రోజు వైఎస్ అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డితో పాటు ఉదయ్ కుమార్ రెడ్డి కూడా సంఘటనా స్థలానికి వెళ్లినట్లు సీబీఐ గుర్తించింది.

అంతే కాకుండా ఆ రోజు అంబులెన్స్, ఫ్రీజర్, వైద్యులను అక్కడికి రప్పించడంలో ఉదయ్ కుమార్ రెడ్డి  కీలక పాత్ర పోషించినట్టు సీబీఐ చెబుతోందిం.  వివేకానందరెడ్డి మృతదేహానికి ఉదయ్ తండ్రి జయప్రకాశ్ రెడ్డి కట్లు కట్టారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఉదయ్ కుమార్ రెడ్డిని పలుమార్లు విచారించిన సీబీఐ ఇప్పుడు అరెస్టు చేసింది. హత్య జరిగిన రోజున అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉదయ్ కుమార్ రెడ్డి  ఉన్నట్టు గూగుల్ టేకవుట్ ద్వారా సీబీఐ గుర్తించింది. ఇలా ఉండగా వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఇటీవల ఒకింత మందగించినట్లు కనిపించింది.

తాజాగా గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్టుతో దర్యాప్తులో కీలక ముందడుగు పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి  అరెస్టుతో తరువాతి వంతు ఎవరిదన్న చర్చ జరుగుతోంది. దర్యాప్తు తీరును, అరెస్టుల పర్వాన్ని గమనిస్తున్న వారు మాత్రం తరువాతి వంతు ఇక వైఎస్ అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కరరెడ్డిదేనని అంటున్నారు.