జగన్ విడుదలకు కాంగ్రెస్ మార్గం సుగమం చేస్తోందా

 

 

సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా లక్ష్మీనారాయణ పనిచేసినంత కాలం సీబీఐ నిత్యం ఏదో రూపంలో వార్తలలో ఉండేది. అదేవిధంగా జగన్ మోహన్ రెడ్డి, అతని అక్రమాస్తుల కేసులతో సంబంధం ఉన్నమంత్రులు, ఐఏయస్ ఆఫీసర్ల కేసుల వ్యవహారం గురించి నిత్యం వార్తలు వినబడేవి. కానీ, ఆయన బదిలీపై వెళ్ళిపోయిన తరువాత వార్తలలో సీబీఐ ప్రస్తావనే వినబడటం లేదు. అంటే, సీబీఐ ఉన్నతాధికారి మారితే సీబీఐ పనితీరు కూడా మారుతుందనుకోవచ్చును.

 

జగన్ మోహన్ రెడ్డిని జైలులో నిర్బందించడంలో తమ హస్తం లేదని వాదిస్తున్నకాంగ్రెస్ పార్టీ, ఈవిధంగా ఒక ఉన్నతాధికారి బదిలీతో కేసును తనకు అవసరమయిన రీతిలో మలుపులు తిప్పుకోగలదని అర్ధం అవుతోంది. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం లేదా ఆ పార్టీతో ఎన్నికల పొత్తులకు అంగీకరించినట్లయితే కాంగ్రెస్ అధిష్టానం అతని కేసులను పక్కదారి పట్టించగల ‘సమర్దుడయిన’ ఉన్నతాధికారిని నియమించవచ్చును. లేకుంటే లక్ష్మినారాయణ వంటి ‘సమర్దుడిని’ నియమించి అతనిని జైలుగోడలకే పరిమితం చేయగలదని అర్ధం అవుతోంది. మరి ప్రస్తుతం సీబీఐ జగన్ మోహన్ రెడ్డి కేసుల దర్యాప్తు, మరియు చార్జ్ షీట్స్ దాఖలు విషయంలో ఎంతవరకు పురోగతి సాధించిందో సామాన్య ప్రజలకి తెలియదు.

 

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ నాలుగు నెలలోగా అతని కేసుల దర్యాప్తు ముగించకపోయినట్లయితే, అతను బెయిలు కోసం దరఖాస్తు చేసుకోవచ్చును. సుప్రీంకోర్టు ఇచ్చిన నాలుగు నెలల గడువు వచ్చేనెల అంటే సెప్టెంబర్ తో ముగుస్తుంది. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం జరిగి ఉంటే, సీబీఐ అతని బెయిలుకి మార్గం సుగమం చేయవచ్చును. లేకుంటే, ఇదివరకులాగే అతని బెయిలుకి అభ్యంతరం చెపుతూ వాదనలు చేసి, అతని రిమాండును మరికొంత కాలం పొడిగించేందుకు ప్రయత్నాలు చేయవచ్చును. అతని కేసులకు సీబీఐ ఎటువంటి ముగింపు ఇస్తుందో తెలుసుకోవాలంటే మరొక నెల రోజులు ఆగవలసిందే.