TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మాపై వేటు వేస్తారా?సీబీఐ తీరుపై ఐఏఎస్‌ల ఆగ్రహం

Published on: Sat Feb 4, 2012 9:08AM

హైదరాబాద్: సిబిఐ దర్యాప్తు తీరుపై సమరభేరీ మోగించేందుకు రాష్ట్రంలోని ఐఎఎస్ అధికారులు సమాయత్తమవుతున్నట్లు కనిపిస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్, ఎమ్మార్ కుంభకోణం, వైయస్ జగన్ ఆస్తుల కేసుల దర్యాప్తు విషయంలో సిబిఐ ఐఎఎస్ అధికారులను వేధిస్తోందని, ఐఎఎస్ అధికారులను బలి పశువులను చేస్తోందని అభిప్రాయపడుతున్నారు. దాదాపు 60 మంది ఐఎఎస్ అధికారులు శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి సిబిఐ దర్యాప్తు తీరుపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు ఓ వినితపత్రం కూడా సమర్పించారు. 'అధికారులు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారా? లేక ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేశారా?' అనే తేడాను సీబీఐ గుర్తించాలని ఐఏఎస్‌లు ముఖ్యమంత్రి ముందు వాదించారు. రెండింటినీ ఒకేలా చూస్తూ... అన్నింటికీ ఐఏఎస్‌లే బాధ్యులంటే ఎలా కుదురుతుందని నిలదీశారు. "2జీలో అక్రమాలు జరిగాయని తేలగానే, సుప్రీంకోర్టు లైసెన్సులు రద్దు చేసింది. అలాగే, రాష్ట్రంలో అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు తప్పయితే, వాటిని ఎందుకు రద్దు చేయరు? కేటాయింపులను, నిర్ణయాలను ఎందుకు ఉపసంహరించుకోవడం లేదు?'' అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. "ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నే అధికారులు అమలు చేసినప్పుడు, దానిపై వివాదం చెలరేగినప్పుడు... ప్రభుత్వం అధికారులను రక్షించాలి. కానీ... ఇప్పుడు మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం ప్రభుత్వం తరఫున న్యాయ సహాయం కూడా అందించడం లేదు. మీచావు మీరు చావండి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు'' అని ఆక్రోశించారు. "ఒక అధికారి అవినీతికి పాల్పడినా, ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినా చర్యలు తీసుకోవాల్సిందే.

కానీ... కేబినెట్, ముఖ్యమంత్రి లేదా మంత్రి ఆదేశాలను అమలు చేసినప్పుడు అధికారులను బలి పశువులను చేయడం సహించరానిది'' అని తేల్చి చెప్పారు. "వేలకోట్లు తిన్నవారు బయట దర్జాగా తిరుగుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్ని, పైవాళ్ల ఆదేశాలను పాటించినందుకు మేం శిక్ష అనుభవించాలా!'' అని ఆవేదన వ్యక్తం చేశారు.ఐఏఎస్‌ల వాదనను సాంతం విన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి... వారికి అండగా ఉంటామంటూనే... ఓ 'ఝలక్' ఇచ్చారు. "మేం మీతో ఉన్నాం. ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించాలో ఆలోచిద్దాం. అడ్వొకేట్ జనరల్‌తో మాట్లాడతాను. న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకుంటాను. ఒక ఉన్నతాధికారుల కమిటీ వేసి, దిద్దుబాటు చర్యలు చేపడతాను'' అని భరోసా ఇస్తూనే... "అరెస్టు చేయడం శిక్ష కాదు కదా! బెయిలు మీద బయటికి రావచ్చు. అరెస్టు అయినంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదు'' అని అన్నారు. సీఎం స్పందనతో ఐఏఎస్‌లో దిగ్భ్రాంతి చెందారు.

కాగా, తిరిగి ఆదివారం సమావేశమై ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టే ఆలోచనలో కూడా వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క రోజు పెన్ డౌన్ సమ్మెకు వారు సమాయత్తమవుతున్నట్లు చెబుతున్నారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కలిసి సిబిఐ దర్యాప్తు తీరుపై ఫిర్యాదు చేయాలనే యోచనలో కూడా వారున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిని కలిసి తర్వాత ఐఎఎస్ అధికారుల తరఫున మహాపాత్రో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఐఏఎస్‌ల పరిమితులు తెలపకుండా సీబీఐ విచారిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు రాతపూర్వకమైన వినతి పత్రాన్ని సమర్పించారు. తమను ఇరికిస్తున్నారని ఐఏఎస్‌ అధికారులు ఆవేదన వ్యక్తంచేశారు. ఫైళ్ల క్లియరెన్స్‌లో జిల్లా అధికారులది కూడా పాత్ర ఉంటుందని అన్నారు. కేబినెట్‌ నిర్ణయాలు అమలు చేశాము కాబట్టి మా తరఫు ప్రభుత్వమే వకాల్తా పుచ్చుకోవాలని ఐఏఎస్‌ అధికారులు అన్నారు. తమను నేరస్తులుగా చేయడానికి సీబీఐ ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఐఏఎస్‌ అధికారుల పరువు మంట కలిపే విధంగా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులని వదిలేసి తమనే సీబీఐ టార్గెట్‌ చేయడం సరికాదని వారు అన్నారు. భవిష్యత్‌ కార్యాచరణకు ఐఏఎస్‌ అధికారులు సిద్ధమౌతున్నారు.