TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజయమ్మఫై టిడిపి నేతల ధ్వజం

Published on: Wed Feb 1, 2012 9:06AM

హైదరాబాద్: సిబిఐ దర్యాప్తును తప్పు పడుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖపై తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కుమ్మడిగా ఆమెను టార్గెట్ చేశారు.తెలుగుదేశం నాయకులు టి. దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.తెలుగుదేశం, కాంగ్రెసు కలిసి కక్ష సాధిస్తున్నారని వైయస్ విజయమ్మ అనడంపై వారు తీవ్ర అభ్యంతరం తెలిపారు.అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ పార్టీలాంటివే అని ప్రజల్లో ప్రచారం చేసుకోవడానికి  తమపై వైయస్ విజయమ్మ అలాంటి ఆరోపణలు చేస్తున్నారని వారన్నారు. కేవలం రాజకీయ సానుభూతిని పొందేందుకే వైయస్ విజయమ్మ ప్రధానికి లేఖ రాశారని వారు అభిప్రాయపడ్డారు. అవినీతి సొమ్ము వస్తున్నప్పుడు భర్తను, కుమారుడిని వైయస్ విజయమ్మ అడగాల్సి ఉండిందని వారన్నారు.

 వైయస్ జగన్ ని  చంపాల్సిన అవసరం ఎవరికీ లేదని, ఆయన పాపాలే ఆయనను చంపుతాయని తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివ ప్రసాద్ అన్నారు. జగన్ ఇప్పటికైనా అప్రూవర్‌గా మారితే మంచిదన్నారు. లేకుంటే ఎమ్మార్ కేసులో అరెస్టైన సునీల్ రెడ్డియే గుట్టు అంతా విప్పుతారన్నారు.  వైయస్ విజయమ్మ సిబిఐ దర్యాఫ్తును తప్పు పడుతూ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు లేఖ రాయడం బాధాకరమని మరో టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు తిరుపతిలో అన్నారు. ఎంపి జగన్ అరెస్టులో విచారణ నత్తనడకన సాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోని మంత్రులపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మార్‌కు భూముల కేటాయింపులో వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని తుంగలో తొక్కారని ఆరోపించారు. వైయస్ విజయమ్మ లేఖ సరికాదని మరో నేత దేవేందర్ గౌడ్ వేరుగా హైదరాబాదులో అన్నారు.