అరెస్టులు..'వాట్ నెక్స్ట్ 'జగన్ వర్గంలో కలకలం
Published on: Tue Jan 3, 2012 8:10AM
హైదరా
బాద్ : ఇన్నాళ్లుగా ప్రశ్నలకే పరిమితమైన సీబీఐ విచారణ ఇప్పుడు అరెస్టుల దశలోకి అడుగుపెట్టింది. వైఎస్ జగన్ ఆర్థిక మూలాలు క్షుణ్నంగా తెలిసిన 'సాక్షి' వైస్ చైర్మన్ సాయిరెడ్డి అరెస్టు జగన్ పార్టీలో కలకలం సృష్టించింది. సీబీఐ ఇప్పటిదాకా సాయిరెడ్డిని అనేకమార్లు ప్రశ్నించినా, ఆయన పెదవి విప్పలేదని, గుట్టు బయటపెట్టలేదని తమకేమీ కాదని జగన్ వర్గంలో ధీమా కనిపించేది. సాయిరెడ్డిని అరెస్టు చేసినట్లు తెలియగానే ఆ పార్టీ నేతలు కలవర పడ్డారు.'కేసులో రెండో నిందితుడైన సాయిరెడ్డిని అరెస్టు చేశారు. తర్వాతి వంతు ఎవరిది? ఏ-1గా ఉన్న జగన్‌నూ అరెస్టు చేస్తారా?' అనే ఆందోళన వారిలో మొదలైంది. ఇప్పటి వరకు లోలోన ఎలా ఉన్నప్పటికీ తన వర్గ నేతల వద్ద మాత్రం 'మనకేమీ కాదు.డోన్ట్ వర్రీ' అంటూ జగన్ భరోసా ఇచ్చేవారు. ఇందులో నిజానిజాలు తెలియనప్పటికీ... కొంత మంది జగన్ మాటలు నమ్ముతూ వచ్చారు. సాయిరెడ్డి అరెస్టుతో ఇప్పుడు ఇలాంటి వారిలోనూ ధైర్యం సడలిపోతోంది. దీంతో పలువురు నేతలు తమ సన్నిహితులకు ఫోన్లు చేసి 'వాట్ నెక్ట్స్' అంటూ ఆరా తీస్తున్నారు.
మరో వైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు కంపెనీలు, వ్యక్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. జగన్ కంపెనీలతో పాటు ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వ్యక్తులు, సంస్థల పేర్లను సీబీఐ తన ఎఫ్ఐఆర్‌లో చేర్చిన సంగతి తెలిసిందే.వాస్తవానికి, ఈ కేసులో జగన్, సాయిరెడ్డిలకు ఎంత పాత్ర ఉందో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొంది ఆపై జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వ్యక్తులు, సంస్థలకూ అంతే ప్రమేయం ఉంది. దీంతో, ఆయా కంపెనీల ప్రతినిధులను సీబీఐ అధికారులు ఇటీవల పలుమార్లు విచారించారు కూడా. అయితే వీరిలో చాలామంది సాక్షి వాస్తవ విలువను ఎక్కువ చూపించడం వల్ల పెట్టుబడులు పెట్టామని సీబీఐ ముందు అంగీకరించి, అందుకు తగ్గట్లు వాంగ్మూలాలు అందచేసి కేసు నుంచి బయటపడే మార్గాలను వెతుక్కుంటున్నట్లు సమాచారం. సాయిరెడ్డితో తొలి అరెస్టు జరగడంతో జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలూ, వ్యక్తులనూ సీబీఐ అరెస్టు చేయవచ్చని నిపుణుల అంచనా.


