అన్నా డిమాండ్లకు కాంగ్రెస్ నో,దీక్షా స్థలం ఖరార్
Published on: Thu Dec 22, 2011 11:39AM
న్యూఢి
ల్లీ: ముఖ్యంగా సీబీఐను లోక్పాల్ పరిధిలోకి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ససేమిరా అంటోంది. సీబీఐతోపాటు మరికొన్ని కీలక శాఖలను లోక్పాల్ పరిధిలోకి తీసుక రావాలని అన్నా హజారే చేస్తున్న డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ ఆమోదించేట్లు లేదు.అన్నా హజారే మాత్రం తాము సూచించిన బిల్లుకు భిన్నంగా ఉండే లోక్పాల్ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని చెపుతున్నారు. అయితే ఇంతకుముందు ముసాయిదాలో కొన్ని మార్పులు చేర్పులు చేసి పార్లమెంటు ముందు పెట్టేందుకు సిద్ధం చేసింది. ఈ ముసాయిదా రేపు సభ ముందుకు రానుంది. అయితే హజారే తాను అనుకున్నట్లుగానే ముంబైలో దీక్ష ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి జనార్థన్ ద్వివేది మాట్లాడుతూ లోక్పాల్ బిల్లు ఆమోదించి తీరుతామని అన్నారు. తాము అన్నా హజారే చేస్తున్న హెచ్చరికలకు భయపడబోమనీ, అయినా బిల్లు ఆమోదం పొందాక అందులోని అంశాలను చూసి అన్నా హజారే స్పందిస్తే బావుంటుందన్నారు. అంతేతప్ప ముందే ఆయన ఓ అంచనాకు వచ్చేయడం సమంజసం కాదని హితవు పలికారు.
మరోవైపు పార్లమెంటులో బిల్లుపై రెండు రోజులు చర్చించేందుకు భాజపా అంగీకరించింది. బిల్లు అంశంపై సభలో అడ్డు తగలబోమని కూడా హామీ ఇచ్చింది. దీంతో యూపీఎ సర్కార్ లోక్పాల్ బిల్లును ఆమోదించేసి "అన్నా హజారే తలనొప్పి"ని వదలగొట్టుకునేందుకు తొందరపడుతున్నట్లు కనిపిస్తోంది.
కాగా అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే ముంబైలోని ఆజాద్ మైదానంలో డిసెంబరు 27 నుంచి దీక్ష చేపట్టనున్నట్టు అరవింద కేజ్రీవాల్ తెలిపారు. ముంబైలో మూడు రోజుల నిరశన దీక్ష చేయనున్నట్టు అన్నా ప్రకటించారు. డిసెంబరు30న జైల్‌భరో కార్యక్రమం నిర్వహించనున్నారు. గతంలో ఎంఎంఆర్డీఏ గ్రౌండ్స్‌లో దీక్ష చేపట్టాలనుకున్నారు. కానీ అక్కడ ఒక్క రోజు అద్దె ఏకంగా రూ.3.77 లక్షలుగా ఉండడంతో తన దీక్షా స్థలాన్ని ఆజాద్ మైదానానికి మార్చుకున్నారు.


