TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీలో ‘కాపు’ చిచ్చు.. వికటిస్తున్న జగన్ వ్యూహం!

Published on: Mon Jun 22, 2026 12:58PM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యూహాలు వికటిస్తున్నాయా? ఆయన వ్యూహాల పట్ల సొంత పార్టీలోనే అసంతృప్తి పెచ్చరిల్లుతోందా? అన్న ప్రశ్నకు జరుగుతున్న పరిణామాలను బట్టి ఔననే సమాధానమే వస్తున్నది.  పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాపు సామాజిక వర్గాన్ని దగ్గరకు తీసేందుకు జగన్  అను సరిస్తున్న వ్యూహాలు వైసీపీలోని  రెడ్డి సామాజిక వర్గ నేతలకు మింగుడుపడటం లేదు. ఇదే విధానంతో వ్యూహాలతో ముందుకు వెడితే మొదటికే మోసం వస్తుందన్న ఆందోళన వారిలో వ్యక్తం అవుతోంది.  ఈ విషయాన్ని పలువురు వైసీపీ నేతలు  అంతర్గత సంభాషణల్లో గట్టిగా చెబుతున్నారు. ఇంత కాలం ఎస్సీలు,   బీసీలు అంటూ వచ్చిన జగన్ ఇప్పుడు   కాపు సామాజిక వర్గం విషయంలో అనుసరిస్తున్న విధానం.. పార్టీకి బీసీలనూ, ఎస్సీలనూ దూరం చేసే ప్రమాదం తీసుకువస్తున్నదని అంటున్నారు. 

అన్నిటికీ మించి.. వైసీపీ ఆవిర్భావం నుండి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం పెట్టి, ఇప్పుడు కాపు సామాజికవర్గాలనికి జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్న చర్చ పార్టీలో మొందలైంది.  అధికారంలో ఉన్న సమయంలో కీలక పదవులు, ప్రాధాన్యత కలిగిన స్థానాల్లో సొంత వర్గానికి ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించలేదనే భావన మొదటి నుంచీ ఉంది. అయినప్పటికీ పార్టీ లైన్‌కు కట్టుబడి ఉన్న నేతలకు, తాజా రాజకీయ పరిణామాలు మింగుడు పడటం లేదు. ముఖ్యంగా ఉభయగోదావరి,  కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఓట్ల కోసం..  జగన్ సిద్ధం చేసిన ప్రణాళికల పట్ల వైసీపీలో అసంతృప్తి భగ్గుమంటోంది. 

రాజకీయంగా పట్టు సాధించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న  వ్యూహం వల్ల ఇతర సామాజిక వర్గాలకు చెందిన నాయకులు దూరం అయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వైసీపీ నాయకులలో వ్యక్తం అవుతోంది.  దూరం జరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.  కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను ఆకట్టుకోవడం అంత సులువు కాదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాష్ట్రంలో  జనసేన, తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న నేపథ్యంలో.. కాపు సామాజికవర్గం  వైసీపీ వైపు గంపగుత్తగా మొగ్గు చూపే అవకాశాలు దాదాపుగా లేవని అంటున్నారు.   అసలు తొలి నుంచీ రాజకీయ వ్యూహల విషయంలో జగన్  విఫలమౌతున్నారని అంటున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు నా బీసీలు అంటూ బీసీ పల్లవి అందుకున్న జగన్ అప్పట్లో కాపు సామాజికవర్గాన్ని పట్టించుకోలేదంటున్నారు.   ఇప్పుడు   కాపు సామాజిక వర్గం అంటూ..  సొంత పార్టీలోని కాపు నేతలతో  ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయించడం వల్ల  మిగతా సామాజిక వర్గాలు దూరమయ్యే ప్రమాదాన్ని జగన్ గుర్తించడం లేదని అంటున్నారు.  అన్ని కులాలకూ సమప్రాధాన్యత ఇవ్వకుండా..   కుల రాజకీయాలను నమ్ముకుంటే మొదటికే మోసం రావడం తథ్యమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది.