TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కుల గణన క్రెడిట్ ఎవరి ఖాతాలోకి?

Published on: Thu May 1, 2025 2:26PM

దేశవ్యాప్తంగా కుల గణనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం (ఏప్రిల్30) జరిగిన  రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీపీఏ) కులగణనకు ఆమోదం తెలిపింది. సీసీపీఏ ఆమోదం మేరకు త్వరలో చేపట్టనున్న జనాభా లెక్కలతోపాటే కులగణన చేపట్టాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందని క్యాబినెట్‌ భేటీ అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ మీడియా సమావేశంలో   వెల్లడించారు. 

ఒక విధంగా ఇది అనూహ్య పరిణామం. రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీపీఏ) సమావేశం  ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని, విపక్షాలే కాదు, స్వపక్షంలోని కీలక నేతలు, చివరకు తలలు పండిన రాజకీయ విశ్లేషకులు కూడా ఊహించ లేదు. నిజానికి  ఓ వంక పహల్గాం ఉగ్రదాడి నేపధ్యంలో ప్రతి ఒక్కరు అటుగా చూస్తున్న సమయంలో ప్రధాని మోదీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు.   భారత్ – పాకిస్థాన్ సరిహద్దుల్లో  యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న సమయంలో జరిగిన సీసీపీఏ సమావేశం అందుకోసమే అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా మోదీ, మేజిక్ బాక్స్ లోంచి కులగణనను బయటకు తీశారు. 

అయితే, రాజకీయ మేథావుల మెదళ్ళకు అందని నిర్ణయాలు తీసుకోవడం మోదీకి కొత్త కాదు. గతంలోనూ మోదీ  Look London, See Paris’ అన్నట్లుగా, ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని, విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఏపీ నుంచి రాజ్యసభ ఉప ఎన్నిక అభ్యర్ధి ఎంపిక విషయంలోనూ ఇలాగే  అందరి అంచనాలను తలకిందులు చేశారు. రేసులోగుర్రాలను పక్కన అపెట్టి అసలు రేసులో లేని, ఓల్డ్ హార్స్  పాకా సత్యనారాయణను  మోదీ ఎంపిక చేశారు. నిజానికి  విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు విజయసాయి మొదలు అన్నామలై వరకు చాలా పేర్లు వినిపించాయి. కానీ  చివరకు  వినిపించని, కనిపించని పాకా ను అదృష్టం వరించింది. మోదీ ఆయనకు కిరీటం పెట్టారు. గతంలో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలోనూ మోడీ  ఇదే మేజిక్ చేశారు. 

అయితే.. నిర్ణయం ఎలా జరిగినా అధికార, ప్రతిపక్ష కూటమి భాగస్వామ్య పార్టీలన్నీ మోదీ నిర్ణయాన్ని స్వాగతించాయి. ముఖ్యంగా కులగణనను ఇంటా బయటా వల్లె వేస్తున్న కాంగ్రెస్ అధినాయకుడు,లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా  ప్రధాని మోదీ నిర్ణయాన్ని స్వాగతించారు. స్వాగాతించడమే కాదు.. కేంద్ర ప్రభుత్వం చేపట్టే కులగణనకు కాంగ్రెస్‌ పార్టీ సహకరిస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు. అయితే  కులగణనకు నిర్ణీత సమయం తెలపాలని  కోరడంతో పాటుగా కులగణనకు తెలంగాణ మోడల్ ను నమూనాగా తీసుకోవాలని సూచించారు. అయితే  అలాంటి అవకాసం లేదని కేంద్ర మంత్రి వైష్ణవ్‌  అంతకు ముందే స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించే సమయంలోనే  కేంద్ర మంత్రి  చాలా స్పష్టంగా వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ సర్కార్లు తీసుకొచ్చిన సర్వేలు చాలా లోపభూయిష్టంగా ఉన్నాయని  అన్నారు. అందుకే..పారదర్శకంగా కులగణన జరగాలని కేంద్రం భావిస్తోందనీ,  ఇందు కోసం సర్వేలపై ఆధారపడకుండా జనాభా లెక్కలలోనే ఈ విషయం నిర్ధారణ చేసుకుంటే సామాజిక సమతుల్యతకు ఆస్కారం లభిస్తుందని కేంద్రం నిర్ణయానికి వచ్చిందని మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పష్టం చేశారు.  సో ..తెలంగాణ మోడల్ ను కేంద్రం పరిశీలించే అవకాశం కూడా లేదని అంటున్నారు.

అయితే.. రాహుల్ గాంధీ సహా  ప్రతిపక్ష పార్టీల నాయకులు కులగణన  తమ విజయంగా పేర్కొం టున్నారు. కేంద్ర ప్రభుత్వం కులగణనకు తలొగ్గేలా చేయడంలో తాము విజయం సాధించామని  కాంగ్రెస్,ఎస్పీ, ఆర్జేడీ నాయకులు ప్రకటించారు. బీహార్‌లో కుల గణన జరగడానికి  ఇప్పుడు దేశవ్యాప్త కులగణనకు కేంద్ర ఒప్పుకోవడానికి తమ పోరాటమే పని చేసిందని ప్రతిపక్ష పార్టీలు చెప్పుకుంటున్నాయి.

అయితే.. అందులో  కొంత నిజం ఉన్నా, మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రతిపక్ష్లాల అంబుల పొదిలోని ప్రధాన అస్త్రాన్ని నిర్వీర్యం చేసిందని  విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్ లో  ఆర్జేడీ, కాంగ్రెస్  సారధ్యంలోని మహా ఘటబంధన్  ఆశలపై మోదీ కోల్డ్ వాటర్  కుమ్మరించారని అంటున్నారు, అయితే.. మహా ఘటబంధన్  భాగస్వామ్య పార్టీలు కాంగ్రెస్, ఆర్జేడీ మోదీ మెడలు వంచి కులగణన తెచ్చామనీ.. అదే తమ ఎన్నికల    ప్రచార అస్త్రం అవుతుందని అంటున్నారు. ఈ నేపధ్యంలో.. కులగణనకు బీహార్ అసెంబ్లీ ఎన్నికలే  ఫస్ట్ టెస్ట్ అంటున్నారు. కులగణన క్రెడిట్ ఎవరి ఖాతాలో చేరాలనేది కూడా బీహార్ ఎన్నికల ఫలితాలే తెలియ చేస్తాయి. అంతవరకు ఎవరిగోల వారిదే.