పార్లమెంట్‌లో కొడాలి కేసినో మంట.. పవన్ సినిమాలకు చెక్‌పై చర్చ..
Published on: Mon Feb 7, 2022 11:07AM
రాజ్యసభలో రాష్ట్ర ఇష్యూలు హల్‌చల్ చేశాయి. గుడివాడలో కేసినో ఎపిసోడ్ పార్లమెంట్‌లో ప్రస్తావనకు వచ్చింది. అలాగే, పవన్ కల్యాణ్ సినిమాలను ఏపీ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నాలను సైతం పెద్దల సభలో రెయిజ్ చేశారు. జగన్‌రెడ్డి పాలనపై ఢిల్లీ సాక్షిగా గళమెత్తారు. ఆంధ్రాలో ఏం చేసినా.. ఎవరికీ తెలీకుండా గొంతు నొక్కేయడమో.. ఎదురుదాడి చేయడమో చేస్తున్న వైసీపీ.. రాజ్యసభలోనూ అదే స్ట్రాటజీ ఫాలో అయింది. ఏపీ అరాచకాలు సభలో వినిపించకుండా.. అడుగడుగునా అడ్డుకున్నారు వైసీపీ ఎంపీలు. ఇంతకీ పార్లమెంట్‌లో ఏం జరిగిందంటే....
రాజ్యసభ వేదికగా టీడీపీ, వైసీపీ తలపడ్డాయి. ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. సీఎం జగన్ ప్రభుత్వ వైఫల్యాలను టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఎండగట్టారు. గుడివాడలో కేసినోపై ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వైసీపీ నేతలను ఇరుకున పెట్టారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాలకు జగన్ చెక్ పెట్టారని కనకమేడల వ్యాఖ్యానించారు. ఏపీలో ఆర్ధిక అరాచకం నెలకొన్నదన్నారు. కేంద్రం జోక్యం చేసుకోకపోతే చేయిదాటి పోతుందన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై కనకమేడల ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే, కనకమేడల ప్రసంగానికి అడుగడుగునా వైసీపీ ఎంపీలు అడ్డుపడుతూనే ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పాలనకన్నా జగన్ పాలన వెయ్యి రెట్లు మెరుగ్గా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
ఇలా టీడీపీ వర్సెస్ వైసీపీ ఎపిసోడ్ పెద్దల సభలో ప్రకంపణలు రేపింది. గుడివాడ కేసినో రచ్చ.. రాజ్యసభలోనూ ఆసక్తికరంగా మారింది.


