ఓటుకు నోటు కేసును కేసీఆర్ అందుకే బయటకుతీశాడా...?

 

ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. సాక్ష్యాత్తు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకే దీనిలో ప్రమేయం ఉందన్న వార్తలు రావడంతో.. తెలుగు రాష్ట్రాల్లో ఈకేసు సంచలనం రేకెత్తించింది. అయితే కొన్ని రోజులు ఈకేసులో హడావుడి జరిగినా ఆ తరువాత సైలెంట్ అయిపోయింది. కానీ ఇన్నిరోజులు ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తెలంగాణ డి.జి.పి., ఎ.సి.పి. డి.జి., రిటైర్డ్ ఐ.పి.ఎస్‌. అధికారి ఎ.కె.ఖాన్‌, కొంత‌మంది కీల‌క అధికారులు, న్యాయ‌వాదులు ఈ స‌మీక్ష స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఉన్నట్టుండి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ఈ కేసుపై మళ్లీ ఇంట్రస్ట్ చూపించడంపై అందరూ ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు.

 

ఈ చర్చల నేపథ్యంలోనే ఓ విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. ప్రస్తుతం కేసీఆర్  ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్ ఏర్పాటుపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అది ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు కానీ... కేసీఆర్ మాత్రం బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలందరితో ముచ్చటిస్తున్నారు.  కాంగ్రెసేత‌ర‌, భాజ‌పాయేత‌ర కూట‌మి ఏర్పాటు అంటూ మ‌మ‌తా బెన‌ర్జీ, దేవెగౌడ‌, అఖిలేష్ యాద‌వ్‌, స్టాలిన్ వంటి నేత‌ల్ని క‌లిసొచ్చారు. కానీ ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్ ఏర్పాటు చేసి త‌ద్వారా దేశ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌. అయితే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన త‌రువాత‌… సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అదే స‌మ‌యంలో, 11 పార్టీల‌తో చంద్ర‌బాబు కూట‌మి క‌ట్ట‌బోతున్నారంటూ జాతీయ మీడియాలో కూడా క‌థ‌నాలు వ‌చ్చాయి. అంతేకాదు అమ‌రావ‌తిలో 11 రాష్ట్రాల ఆర్థిక‌ మంత్రుల స‌మావేశం నిర్వ‌హించారు. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన విధి విధానాల‌ను మార్చాలంటూ త్వ‌ర‌లోనే అంతా క‌లిసి రాష్ట్రప‌తిని క‌లుద్దామ‌న్నారు. అయితే, జాతీయ స్థాయిలో రాజ‌కీయ‌ కూట‌మి క‌ట్టాల‌న్న ల‌క్ష్యంతో ఇవ‌న్నీ చేస్తున్న‌ట్టు చంద్ర‌బాబు ఎక్కడా చెప్ప‌క‌పోయినా… భవిష్యత్తులో తాను పిలిస్తే ఢిల్లీ వేదిక‌గా క‌లిసి ప‌నిచేసేందుకు వ‌చ్చేవారి సంఖ్య‌ను నెమ్మ‌దిగా పెంచుకుంటున్న‌ట్టుగానే అర్థం చేసుకోవాలి. ఇక ఇవన్నీ గమనిస్తున్న కేసీఆర్... టీడీపీకి..చంద్రబాబుకు చెక్ పెట్టాలంటే దానికి ఓటుకు నోటు కేసు ఒక్కటే దారి అని.. అందుకే ఈ కేసును మరోసారి తెరపైకి తీసుకొచ్చి త‌న ఫ్రెంట్ వ్యూహానికి స‌మాంత‌ర ఆలోచ‌న‌తో మొద‌లైన ప్ర‌య‌త్నాలు ఏవైనా ఉంటే, వాటికి చెక్ పెట్టాల‌నే సంకేతాలు ఇవ్వ‌డ‌మే కేసీఆర్ తాజా ఎత్తుగ‌డ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

ఇదిలా ఉండగా.. ఈ కేసులో చండీగఢ్ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక రాగా  కేసీఆర్ ను కలిసిన ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. ఆడియో టేపుల్లో వినిపిస్తున్న గొంతు ఏపీ సీఎం చంద్రబాబుదేనని ల్యాబ్ పరీక్షలు నిర్ధారించాయని తెలిపారు. నాలుగు రోజుల క్రితమే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక తెలంగాణ పోలీసులకు అందగా, కేసును కొలిక్కి తెచ్చేందుకు గత నాలుగు రోజులుగా ఏసీబీ అధికారులు కసరత్తు చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా కేసీఆర్, పోలీసులపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండవని, చట్టం ముందు అందరూ సమానమేనని, కేసు విచారణలో ముందుకెళ్లాలని సూచించినట్టు తెలుస్తోంది. మరి చూద్దాం ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో.. దీనిపై చంద్రబాబు ఎలా రెస్పాండ్ అవుతాడో....