తన నిర్ణయాలే తనకు శత్రువు.. జగన్ సర్కార్ పై అంతర్జాతీయ ట్రిబ్యునల్ లో కేసు!

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై అంతర్జాతీయ ట్రిబ్యునల్ లో కేసులు నమోదు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి విదేశాంగ శాఖకు ఐదు దేశాలు సమాచారమిచ్చాయి. తమ పెట్టుబడుల ఒప్పందాలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించడమే తమ చర్యలకు కారణమని ఆయా దేశాలు అంటున్నాయి. ఈ వ్యవహారంపై పీఎంవో కూడా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పంద వివాదం ఏపీ ప్రభుత్వాన్ని వెంటాడుతుంది.

ఆంధ్రప్రదేశ్ లో పునరుత్పాదక విద్యుత్ రంగంలో వివిధ దేశాలు పెట్టుబడులు పెట్టాయి. సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేశాయి. ఏడు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కోసం వివిధ దేశాలు ఏపీలో రూ.40వేల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా వెచ్చించాయి. జపాన్, అబుదాబి, కెనడా, అమెరికా, సింగపూర్ వంటి దేశాలు తమ ప్రభుత్వ నిధులతో పాటు పెన్షన్ ఫండ్ నుంచి కూడా పెట్టుబడుల వెచ్చించాయి. ఈ సంస్థల నుంచి కరెంటు కొనుగోళ్ల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన విద్యుత్ నియంత్రణ కమిషన్ లతో పాటు ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తరువాత టారిఫ్ లు నిర్ణయించారు.  ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఒప్పందాలను పట్టించుకోవడం మానేశారు. ముందుగా ధరలు తగ్గించాలంటూ పిపిఎలతో చర్చలు జరిపేందుకు ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. దీనిపై పునరుత్పాదక విద్యుత్ సంస్థలు ఏపీ హైకోర్టును ఆశ్రయించాయి. హై కోర్టు దీనిపై స్టే ఇవ్వడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీని సస్పెండ్ చేసింది. ఎటువంటి కారణాలు లేకుండా పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్లు నిలిపి వేయడం కానీ.. బిల్లులూ చెల్లించడం కాని.. ఆపవద్దని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ధరలు తగ్గించే అంశంపై రెగ్యులేటరీ కమిషన్ ను ఆశ్రయించవచ్చని సూచించింది.

ఏపీ సర్కార్ 6 నెలల నుంచి సౌర, పవన విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్న సంస్థలకు బిల్లులు చెల్లించడం లేదు. విద్యుత్ కూడా తీసుకోవడం లేదు. తమ పెట్టుబడులకు ముప్పు ఏర్పడడంతో ఆయా దేశాలు భారత విదేశాంగ శాఖకు లేఖలు రాశాయి. వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరిస్తామని కేంద్రం చెప్పింది. అటువంటి సూచనలు కనిపించకపోవడం, బిల్లులు నిలిపి వేయడంతో ఈ దేశాలు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల అంశాల పై అంతర్జాతీయ మధ్యవర్తిత్వం జరిపే ట్రిబ్యునల్ ను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు భారత విదేశాంగ శాఖకు సమాచారమిచ్చాయి. దీంతో భారత విదేశాంగ శాఖ ఈ అంశాన్ని కేంద్రలోని అత్యున్నత స్థాయి వర్గాల దృష్టికి తీసుకువెళ్లింది. విషయం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పునరుత్పాదక విద్యుత్ రంగంలో కుదిరిన ఒప్పందాలను సమీక్షించే అధికారం ప్రభుత్వానికి ఉండదు కనుక ఇందుకు అనుగుణంగా చట్ట సవరణ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. 

ఏపీలో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల పునఃసమీక్ష, పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు బిల్లులు చెల్లించక పోవడం సరఫరా సక్రమంగా తీసుకోకపోవటంపై కేంద్రం సీరియస్ గా ఉంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఏర్పడిన వివాదానికి సంబంధించి అంతర్జాతీయ ట్రిబ్యునల్ కు వెళ్లే అవకాశం లేదని ఏపీ అధికారులు చెప్తున్నారు. పెట్టుబడులు పెట్టిన సంస్థలు.. దేశాలు.. భారతదేశం పై ఉన్న నమ్మకంతోనే కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు తాము పెట్టుబడులు పెట్టామని చెప్తున్నారు. అందువలన అంతర్జాతీయ ట్రిబ్యునల్ ను ఆశ్రయించే హక్కు తమకుందని వాధిస్తున్నాయి. ఈ విషయం పై కేంద్ర విద్యుత్ శాఖ సీరియస్ గా ఉంది. ఈ అంశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఏపీ ప్రభుత్వం తీరు వలన ఇతర రాష్ట్రాలలో కూడా పునరుత్పాదక విద్యుత్ రంగాల్లో అలజడి ప్రారంభమయ్యే ప్రమాదముందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లింది.