అల్లు అర్జున్ మామపై కేసు నమోదు.. ఎందుకంటే..!
Published on: Tue Sep 15, 2026 5:31PM

నానక్‌రామ్‌గూడలోని భూ వివాదానికి సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్ మామ కే. చంద్రశేఖర్ రెడ్డి, మురళీ ధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ) పరిధిలోని మంత్రీ కాస్మోస్ భవన ప్రాంగణంలోకి కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి, గేటు తాళాలు పగులగొట్టి, కొన్ని నిర్మాణా లను ధ్వంసం చేసి టిన్‌షీట్లు ఏర్పాటు చేశారంటూ మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసోసియేషన్ తరఫున పెద్దిరాజు ఈ ఫిర్యాదును గచ్చిబౌలి పోలీసులకు అందజేశారు. నానక్‌రామ్‌గూడలోని సర్వే నంబర్ 130లో మంత్రీ కాస్మోస్ భవనం ఉందని, ఇది ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)గా గుర్తింపు పొందిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
.webp)
ఈ భవనంలో వివిధ బహుళజాతి సాఫ్ట్‌వేర్ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఉదయం సుమారు 8.40 గంటల సమయంలో మురళీధర్ రెడ్డి, గడ్డం రవి నేతృత్వంలోని కొందరు వ్యక్తులు సౌత్‌వెస్ట్ కార్నర్ గేట్ నుంచి భవన ప్రాంగణంలోకి ప్రవేశించారు. గేట్‌కు ఉన్న తాళాన్ని పగులగొట్టి, అక్కడి కొన్ని నిర్మాణాలను ధ్వంసం చేసి టిన్‌షీట్లు ఏర్పాటు చేసినట్లు ఆరోపించారు.ఈ చర్యలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ సిబ్బందిని తోసివేసి, తమ కార్యకలాపాలకు అడ్డొస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం ఘటన భవనంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిందని, ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను పెన్‌డ్రైవ్‌లో పోలీసులకు అందజేసినట్లు అసోసియేషన్ తెలిపింది.భవనం దక్షిణ భాగంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, జనరేటర్, వ్యర్థాల నిర్వహణ షెడ్ ఉన్నాయని అసోసియేషన్ పేర్కొంది.
సౌత్‌వెస్ట్ కార్నర్ ప్రాంతాన్ని నీటి ట్యాంకర్లు, చెత్త సేకరణ వాహనాల రాకపోకలకు ఉపయోగిస్తున్నారని, అత్యవసర పరిస్థితుల్లో ఫైర్ ఇంజిన్లు కూడా ఈ మార్గం నుంచే వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది.ఈ మార్గాన్ని ఆక్రమిస్తే భవనంలోని ఐటీ సంస్థల కార్యకలాపాలకు మాత్రమే కాకుండా అత్యవసర సేవలకు కూడా అంతరాయం కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. భవన భద్రత, అక్కడ పనిచేస్తున్న సంస్థల కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. భవన ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించి, సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించి, నిర్మాణాలను ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ కోరింది.
అలాగే భవనానికి భద్రత కల్పించడంతో పాటు ఐటీ సంస్థల కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు డీజీపీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మాదాపూర్ డీసీపీ, గచ్చిబౌలి ఏసీపీలకు కూడా ఫిర్యాదు ప్రతులను అందజేసినట్లు అసోసియేషన్ తెలిపారు.. అక్రమంగా ప్రవేశించి బెదిరింపులకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ కోరింది....
[ Case registered against Allu Arjuns uncle, K. Chandrasekhar Reddy, Murali Dhar Reddy, Gaddam Ravi, SEZ, Mantri Cosmos Building, Cyberabad Police, Bunny, Telugu News, Telugu One ]


