చింతమనేని ప్రభాకర్ పై చోరీ కేసు!!

 

పోలవరం కాలువపై నీటిని తోడడానికి ఏర్పాటు చేసిన పైపులను మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులు దొంగిలించారంటూ.. సత్యనారాయణ అనే రైతు ఇచ్చిన ఫిర్యాదుపై పెదవేగి పోలీసులు కేసు నమోదు చేశారు.

పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడికాలువ నుంచి కృష్ణానదిలోకి వెళుతున్న గోదావరి నీటిని దెందులూరు నియోజకవర్గంలోని పంట పొలాలకు సరఫరా చేయటానికి అనువుగా మూడేళ్ల క్రితం చింతమనేని ప్రభాకర్ అధ్వర్యంలో పైపులు ఏర్పాటు చేసి నీటిని చెరువులకు మళ్లించారు. దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు రూరల్‌ మండలాల్లోని గ్రామాల్లో సాగుకు ఈ పైపుల ద్వారా నీరందిస్తున్నారు. 

అయితే, ఇటీవల చింతమనేని అనుచరులు వచ్చి.. చింతమనేని తీసుకురమ్మన్నారంటూ పైపుల్ని తీసేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రైతులు ఆందోళన నిర్వహించారు. పైపుల్ని మాజీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు చోరీ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చింతమనేనితో సహ  మరో ఐదుగురిపైన వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

మరోవైపు ఆ పైపులు చింతమనేని తన సొంత డబ్బులతో ఏర్పాటు చేసారని, వాటిని ఆయన తీసుకెళ్తే చోరీ ఎలా అవుతుందని ఆయన సన్నిహితులు అంటున్నారు. మరికొందరు మాత్రం.. పవర్లో లేనప్పడు ప్రజలకు మరింత సాయం చేయటం, అండగా ఉండటం ద్వారా వారి మనసుల్ని గెలుచుకునే అవకాశం లభిస్తుంది. అలా కాకుండా తన పైపులు తాను తీసుకెళ్తానంటూ ఇలాంటి పనులు చేస్తే మరింత వ్యతిరేకత మూటగట్టుకుంటారు అని అభిప్రాయపడుతున్నారు.