హాలీడేక్లబ్బుల్లో డబ్బులాటలు!
Published on: Mon Aug 6, 2012 10:36AM
రాష్ట్రంలోని హాలీడేక్లబ్బుల్లోనూ, రీసార్ట్స్‌లోనూ పేకాట జోరుగా సాగుతోంది. ఆఫీసర్ల క్లబ్బులు కూడా ఈ పేకాటకు వేదికలవు తున్నాయి. దీంతో పేకాటరాయుళ్లు అందరూ క్లబ్బుల్లో సభ్యులుగా చెలామణి అవుతున్నారు. పోలీసులకు ఉన్న ఇతర భద్రత పరమైన కారణాల వల్ల ఈ క్లబ్బులపై పెద్దగా దృష్టిసారించటం లేదు. పైగా ఉన్నతస్థాయిలో ఉన్న వారందరూ ఈ పేకాటలో మంచి హ్యాండ్‌లుగా పేరుగడించటం వల్ల కూడా వీటిని పోలీసులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని టౌన్‌హాలు, ఆఫీసర్స్ క్లబ్బు కూడా పేకాట పాపారాయుళ్ల నెలవులుగా మారాయి.
దీనిపై ఎవరూ అంతగా దృష్టిసారించటం లేదు. కానీ, ఈ పేకాటతో పాటు తినటానికి తిండి, తాగటానికి మద్యం కూడా సరఫరా అవుతోంది. అందువల్ల మద్యం తాగే అలవాటున్న వారందరూ ఈ క్లబ్బుల చుట్టూ ఎక్కువగా తిరుగుతున్నారు. తూర్పుగోదావరి తరువాత దాని పక్కనే ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఈ తరహా చిత్రాలే కనిపిస్తున్నాయి. కృష్ణాజిల్లా కంచికచర్ల పరిటాల ఉమా హాలీడేక్లబ్బులో పేకాట మంచి జోరుగా ఉన్నప్పుడు పోలీసులు దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. ఇక్కడ భారీబెట్టింగులతో పేకాట జరుగుతోందని పోలీసులకు అందిన సమాచారం. దాని ప్రకారం దాడులు చేసిన పోలీసులు నిందితులను నందిగామకోర్టులో హాజరుపరిచే సమయంలో పేకాటరాయుళ్లు తప్పించుకున్నారు. దీనిపై ఆగ్రహించిన జిల్లా ఎస్పీ ఒక హెడ్‌కానిస్టేబుల్‌ను, తొమ్మిది మంది పోలీసులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.


