TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

న్యాయవాది హత్యకు ఉపయోగించిన కారు లభ్యం

Published on: Wed May 27, 2026 12:25PM

హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన ప్రముఖ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో  కీలక పురోగతి సాధించారు పోలీసులు. హంతకులు ఉపయోగించిన స్కార్పియో కారును పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం బైపాస్ రోడ్డుపై అనుమానాస్పదంగా వదిలిపెట్టిన ఈ వాహనం కేసు దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది. ఘటన అనంతరం ఆధారాలు చెరిపివేయాలనే ఉద్దేశంతో నిందితులు కారును అక్కడే వదిలేసి పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు.

హైదరాబాద్‌కు చెందిన   హైకోర్టు న్యాయవాది, వక్ఫ్ బోర్డు ప్యానెల్ అడ్వకేట్‌గా పేరుగాంచిన మొయిజుద్దీన్ ఇటీవల  దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య  రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భూ వివాదాలు, వక్ఫ్ భూముల పరిరక్షణకు సంబంధించిన కేసుల్లో ఆయన చురుకుగా వ్యవహరించడంతో కొందరు ప్రత్యర్థులు పక్కా ప్రణాళికతో ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మొదట ఈ ఘటనను సాధారణ రోడ్డు ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేసిన నిందితులు, స్కార్పియో కారుతో ఢీకొట్టి  హిట్ అండ్ రన్ లా చిత్రీకరించాలని యత్నించినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. అయితే సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, వాహన చలనాల విశ్లేషణతో పోలీసులు అసలు కుట్రను ఛేదించారు.

ఈ కేసులో ఇప్పటికే గోవాలో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో వినయ్ అనే వ్యక్తే స్కార్పియో కారు నడిపినట్లు గుర్తించారు. నిందితులను హైదరాబాద్‌కు తరలించి ప్రత్యేక బృందాలు విచారిస్తున్నాయి. స్థానిక భూముల కబ్జాలు, ఆస్తి వివాదాలే ఈ హత్య వెనుక ప్రధాన కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. కేసు తీవ్రత దృష్ట్యా జాతీయ మానవ హక్కుల సంఘం కూడా స్వయంగా కేసు నమోదు చేసి నివేదిక కోరినట్లు తెలుస్తోంది. ఈ హత్య కేసు రాష్ట్ర రాజకీయ, న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారగా… కుట్ర వెనుక మరెవరి పాత్ర ఉందన్న దానిపై పోలీసులు  దర్యాప్తు కొనసాగిస్తున్నారు.