TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేక..!

Published on: Mon Mar 3, 2025 11:12AM

పెంపుడు జంతువులతో గాఢమైన అనుబంధం ఏర్పడటం సర్వ సాధారణమే. ఇంట్లో మనుషుల్లాగే వాటికీ పేర్లు పెట్టి ప్రేమగా సదుకోవడం తెలిసిందే. వాటికి పెళ్లిళ్లూ, పేరంటాలూ చేయడం, నామకరణ, పుట్టిన రోజు పండుగలు ఘనంగా చేయడం విన్నాం. వాటికి చిన్ని పాటి ఆనారోగ్యం చేసినా, గాయం తగిలినా విలవిల్లాడిపోయి.. పశువైద్యుల చుట్టూ తిరిగే వారినీ చూశాం. ఒక వేళ దురదృష్ట వశాత్తు పెంపుడు జంతువులు మరణిస్తే వాటికి శాస్త్రోక్తంగా కర్మ కాండలు జరిపించన సంఘటనలూ ఉన్నాయి.

అయితే ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ మహిళ తన పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేక ఏకంగా బలవన్మరణానికి పాల్పడి తనువు చాలించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో  జరిగింది.  హసన్‌పూర్ లో నివసించే పూజ (36) అనే మహిళకు ఎనిమిదేళ్ల కిందట వివాహం అయ్యింది. అయితే కేవలం రెండేళ్లకే భర్తతో విభేదాలతో విడిపోయింది. అమ్మ, సోదరులతోనే నివసిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె డిప్రషన్ కు గురైంది. ఒంటరి తనంతో బాధపడుతూ ఉండేది.  

ఈ తరుణంలో ఆమెకు రోడ్డుపై ఓ పిల్లి దొరికింది. దానిని తెచ్చుకుని పెంచుకోవడం ప్రారంభించింది. ఒంటరి తనం నుంచి బయటపడేందుకు ఆ పిల్లితోడిదే లోకంగా గడపడం మొదలు పెట్టింది. దీంతో ఇంట్లో వాళ్లు కూడా ఆమె మళ్లీ మామూలు మనిషి అవుతోందని సంతోషించారు. అయితే  ఆ పిల్లి హఠాత్తుగా చనిపోయింది. పిల్లి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన పూజ.. ఆ పిల్లి మళ్లీ బతుకుతుందన్న వెర్రి భ్రమలో కూరుకుపోయింది. ఇంట్లో వాళ్లు పిల్లిని పూడ్చిపెడదామని చెప్పినా వినలేదు. రెండు మూడు రోజుల్లో ఆ పిల్లి బతికి మళ్లీ మామూలుగా ఇంట్లో తిరుగుతుందంటూ పిల్లిని ఖననం చేయడానికి అంగీకరించలేదు.  మూడు రోజులు గడిచిన తరువాత ఆమెకు పిల్లి ఇక బతకదన్న అవగాహనకు వచ్చి ఇంట్లోని మూడో అంతస్తులో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.