కప్పగంతులు...
Published on: Sat Aug 25, 2012 10:49AM
ఈ మధ్యకాలంలో పిచ్చివాడికి ఏదైనా గుర్తుకొచ్చి నవ్వినా .. అదిగో నన్నుచూసే నవ్వాడు.. నన్ను అవమానించాడు... కొంతమంది పార్టీలోని నేతలే దీని వెనుకవుండి చేయించారు. కనుక నేను ఈ పార్టీలో ఉండలేను.. అంటూ మరోచోటుకు గెంతడం..పరిపాటి! లేకుంటే.. నన్ను కాదని పార్టీలోని తన ప్రత్యర్ధికి పదవి ఇచ్చారనో.. ఇంట్లో చేసుకున్న వంకాయకూర.. వెంటవున్న నాకు పెట్టకుండా.. బయటనుండి వచ్చిన ఇంకొకరి పెట్టారనో... కూడా పార్టీ మారిపోవచ్చు. ఇలా పార్టీలు మారే ఉద్దేశమే ఉండాలికాని ఎన్నో... ఎన్నెన్నో... కారణాలు చెప్పుకోవచ్చు! ప్రజాసేవకోసమే రాజకీయాల్లోకి వచ్చాను.. అందుకే ఈ పార్టీలో చేరా.. కాని నన్ను కూరలో కరివేపాకులా తీసేస్తున్నారు... మనస్తాపంతో బయటికివెళ్ళిపోతున్నా...ఇదీ నేటి నేతలు ఒకచోటునుండి మరోచోటుకు చేసే కప్పగంతులకు ఇచ్చే వివరణ.
గతంలో ఎంతోమంది నేతలు తామున్న పార్టీలోనుండి మరోపార్టీలోకి వెళ్ళారు. అదే రీతిలో ఉప్పునూతల కూడా జగన్‌పార్టీలోకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. విలువలకు కట్టుబడి ఒకేపార్టీలో ఉండటమన్నది నేడు ఎక్కడా చూడలేం. ఇంద్రదనస్సులో ఏడువర్ణాలు ఉంటాయి. నేటి నేతలకు ఎన్ని వర్ణాలుంటాయో చెప్పడం కష్టమే సుమా! ఇసుకను పిండి తైలం తీసే ప్రయత్నం చేయవచ్చుగాని పార్టీలు మారే నేతల చేతలను, మాటలను అర్ధం చేసుకోలేం. ‘ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే...’ అన్నాడు ఓ సినీకవి. కాని నేటి రాజకీయాలను చూస్తుంటే... ‘నాయకులమాటలకు అర్ధాలే వేరులే...’ అని అనక తప్పదు.
ఒకరు ఓ పార్టీ తరపున ఎన్నికై తెల్లవారే సరికి మరోపార్టీలో ఉంటారు. ఇలా కప్పగంతులు గెంతుతూనే ఉన్నారు. ఉంటున్నారు. భవిష్యత్‌లో కూడా ఉంటారు! ఇలాగే ఉపేక్షిస్తే... ఇలా పార్టీలను మార్చే వారితో దేశం నిండిపోయి.. అత్యధికంగా పార్టీలు మార్చిన నేతలు గిన్నీస్ రికార్డులను బద్ధలు కొట్టినా ఆశ్చర్యపోనక్కరలేదు. గతంలో ఎక్కువశాతంమంది ప్రజాసేవకోసం రాజకీయాల్లోకి వస్తే... నేడు తమ రక్షణకోసం, తమవారిసేవకోసం మాత్రమే రాజకీయాల్లోకి వస్తున్నారు.. పార్టీలు మారుతున్నారు. పార్టీలు మార్చే నేతల్ని చూసి ఊసరవెల్లి కూడా కాస్తంత ఫీలవుతోంది మరి! ఒక పార్టీ తరఫున ఒకసారి ఎన్నికల్లో పోటీ చేస్తే అప్పట్నుంచి అయిదేళ్ళపాటు ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఉంటామంటూ అభ్యర్ధుల నుండి అఫిడవిట్లు తీసుకుంటే బావుంటుందేమో...! ఆలోచించాల్సిందే!


